Tirumala: 'పవిత్ర జెరూసలేం యాత్ర'... తిరుమల బస్ టికెట్ వెనుక అన్యమత ప్రచారం!

  • భక్తులు ఆందోళన చెందుతున్నారు
  • పాలక మండలి ఎక్కడ?
  • బాధ్యతారాహిత్యం తగదు
  • నిప్పులు చెరిగిన టీటీడీ మాజీ సభ్యుడు ఏవీ రమణ
తిరుమలలో మరోసారి కలకలం రేగింది. తిరుమల భక్తులకు ఇచ్చే ఆర్టీసీ బస్ టికెట్ల వెనుక జెరూసలేం యాత్రకు తక్కువ ఖర్చుతో తీసుకెళతామని ఓ ప్రకటన కనిపించడమే ఇందుకు కారణం. ఈ టికెట్లను పొందిన భక్తులు, ఆర్టీసీ అధికారులను నిలదీస్తూ, నిరసన తెలుపగా, మొత్తం వ్యవహారంపై తీవ్ర దుమారం చెలరేగుతోంది.

తిరుపతి నుంచి తిరుమలకు వచ్చీపోయే ప్రయాణికులకు ఇస్తున్న టికెట్ల వెనుక అన్యమత ప్రచారం ఉండటంపై పాలకమండలి మాజీ సభ్యుడు ఏవీ రమణ మండిపడ్డారు. టీటీడీ చైర్మన్ నియామకం సమయంలోనే భక్తులు ఆందోళన చెందారని, వారి భయాలను నిజం చేస్తూ, ఇప్పుడు ప్రతి భక్తుడి చేతులోనూ అన్యమతానికి సంబంధించిన ప్రచారాన్ని ఉంచడం ఏంటని మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో పాలకమండలి లేకుండా రెండు నెలల కాలం గడవడం ఎన్నడూ లేదని అన్నారు. భక్తుల మనోభావాలను కాపాడాల్సిన వారు బాధ్యతారహితంగా ఉంటున్నారని విమర్శించారు. కాగా, ఈ టికెట్ల వెనుక "తక్కువ ఖర్చు, అన్ని సౌకర్యాలతో క్రైస్తవులకు పవిత్ర జెరుసలేం యాత్ర" అంటూ ఓ ప్రకటన ముద్రితమై ఉండటం భక్తుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది.

Tirumala
Tirupati
Jerusalem
Non Hindu

More Telugu News