bigboss: నటి మధుమితపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తమిళ 'బిగ్‌బాస్' షో నిర్వాహకులు

  • హౌస్‌లో ఆత్మహత్యకు యత్నించి కలకలం రేపిన మధుమిత
  • బయటకు పంపేసిన నిర్వాహకులు
  • పారితోషికం ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు
తమిళ బిగ్‌బాస్ షోలో ఆత్మహత్యకు యత్నించి కలకలం రేపిన హాస్యనటి మధుమితపై షో నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు రావాల్సిన పారితోషికాన్ని వెంటనే ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె బెదిరిస్తోందని విజయ్ టీవీ నిర్వాహకులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమపై పోలీసులకు ఫిర్యాదు చేయడంపై మధుమిత స్పందించింది.

తమ మధ్య ఎటువంటి సమస్యా లేదని, తనపై వారు కేసు ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదని మధుమిత ఆవేదన వ్యక్తం చేసింది. తనకు రావాల్సిన పారితోషికాన్ని అడిగానని, వారు బిల్లు పంపమంటే పంపానని తెలిపింది. అంతా సవ్యంగానే ఉందని, కానీ అకస్మాత్తుగా వారు తనపై పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశారో తనకు తెలియదని పేర్కొంది. తాను గత పదేళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నానని, తానెప్పుడూ ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదని గుర్తు చేసింది.

తనపై కేసు పెట్టిన విషయం తెలిసి వెంటనే నిర్వాహకులకు ఫోన్ చేశానని, కానీ వారు స్పందించలేదని మధుమిత పేర్కొంది. బిగ్‌బాస్ హోస్ట్ కమల్ హాసన్ ఈ విషయంలో జోక్యం చేసుకుని పరిష్కారం చూపించాలని కోరింది. బిగ్‌బాస్ షో నిర్వాహకులతో ముందుగా చేసుకున్న ఒప్పందం మేరకు ఇంతకు మించి మాట్లాడలేకపోతున్నానన్న మధుమిత.. తాను హౌస్ నుంచి బయటకు రావడానికి కారణమైన ఫుటేజీలను ప్రసారం చేయకపోవడం మాత్రం బాధగా ఉందని పేర్కొంది.
bigboss
Kamal Haasan
actress madhumita

More Telugu News