సునంద మృతదేహంపై 15 గాయాలు ఉన్నాయి: కోర్టుకు తెలిపిన ఢిల్లీ పోలీసులు

21-08-2019 Wed 10:37
  • సునంద ఎంతో మానసిక వేదనకు గురయ్యారు
  • మెహర్ తరార్ తో శశిథరూర్ కు ఉన్న సంబంధాలు ఆమెను ఎంతో బాధించాయి
  • ఆమె శరీరంలో విషం ఆనవాళ్లు ఉన్నాయి
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శశిథరూర్ భార్య సునంద పుష్కర్ ఎంతో మానసిక వేదనకు గురైందని ఢిల్లీలోని ఓ కోర్టుకు ఢిల్లీ పోలీసులు తెలిపారు. తన భర్తతో సంబంధాలు కూడా సరిగా లేకపోవడంతో ఆమె తీవ్ర ఒత్తిడికి గురైందని చెప్పారు. సునందను థరూర్ టార్చర్ పెట్టారని... ఈ క్రమంలోనే ఆత్మహత్యకు ఆమె పాల్పడ్డారని ఆరోపించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం సునంద శరీరంలో విషం ఉందని, శరీరంపై 15 చోట్ల గాయాలు ఉన్నాయని చెప్పారు. పాకిస్థానీ జర్నలిస్టు మెహర్ తరార్ తో శశిథరూర్ కు ఉన్న సంబంధం కూడా సునందను మానసిక వేదనకు గురిచేసిందని తెలిపారు. శశిథరూర్ ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. ఆయనపై ఐపీసీ సెక్షన్లు 498-ఏ, 306 కింద కేసులు నమోదై ఉన్నాయి.