SBI: వచ్చే ఐదేళ్లలో ఎస్‌బీఐ డెబిట్ కార్డులు గల్లంతు: ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌

  • దేశంలో ప్రస్తుతం 93 కోట్ల డెబిట్, క్రెడిట్ కార్డులు
  • యోనో యాప్ సేవలను విస్తృతం చేయనున్న ఎస్‌బీఐ
  • క్రెడిట్ కార్డుతోనూ పని ఉండదన్న రజనీశ్ కుమార్

మరో ఐదేళ్లలో డెబిట్ కార్డులు మాయం కానున్నాయని ఎస్‌బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ పేర్కొన్నారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి ప్లాస్టిక్ కార్డులను తొలగించాలని యోచిస్తున్నామని, ఇది సాధ్యమేనని అన్నారు. దేశంలో ప్రస్తుతం 93 కోట్ల డెబిట్, క్రెడిట్ కార్డులు వినియోగంలో ఉన్నాయన్నారు. ఎస్‌బీఐ అందుబాటులోకి తీసుకొచ్చిన యోనో వంటి డిజిటల్ యాప్ సేవలను మరింత విస్తరించడం ద్వారా కార్డుల వినియోగాన్ని తగ్గించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

యోనో యాప్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని, దీని సాయంతో ఏటీఎం నుంచి నగదును విత్‌డ్రా చేసుకోవచ్చని, కార్డుతో పనిలేకుండానే దుకాణాల్లో చెల్లింపులు చేసుకోవచ్చని వివరించారు. ప్రస్తుతం 68 వేలుగా ఉన్న యోనో కేంద్రాల సంఖ్యను మరో ఏడాదిన్నరలో పది లక్షలకు చేరుస్తామన్నారు. అప్పుడు కార్డుతో ఇక అవసరమే ఉండదని రజనీశ్ పేర్కొన్నారు. యోనో యాప్ ద్వారా కొన్ని వస్తువుల కొనుగోలుకు రుణం కూడా లభిస్తుందని, అప్పుడిక క్రెడిట్ కార్డుతో పనే ఉండదన్నారు. వచ్చే ఐదేళ్లలో కార్డు వినియోగం గణనీయంగా తగ్గుతుందని రజనీశ్ పేర్కొన్నారు.

More Telugu News