Shilpa shetty: పది కోట్లను కాదనుకున్న శిల్పాశెట్టిపై మాజీ సీఎం శివరాజ్ సింగ్ ప్రశంసలు

  • శిల్పా శెట్టి సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించారు
  • పది కోట్ల రూపాయల ఆఫర్‌ను వదిలేసుకున్నారు
  • మిగతా సెలబ్రిటీలు కూడా ఆమెను అనుసరించాలి

బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పాశెట్టిపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసలు కురిపించారు. ఇటీవల ఓ ఆయుర్వేద కంపెనీ శిల్పను సంప్రదించింది. తాము ఉత్పత్తి చేసే స్లిమ్మింగ్‌పిల్‌కు ప్రచారం నిర్వహించాలని చెబుతూ పది కోట్ల రూపాయలు ఆఫర్ చేసింది. అయితే, ఈ ఆఫర్‌ను శిల్ప తిరస్కరించింది. తాను నమ్మని విషయాలకు ప్రచారం చేయలేనని తెగేసి చెప్పింది. అంతేకాదు, ఆహారంలో కొద్దిపాటి మార్పులతో కొంచెం ఆలస్యంగానైనా సన్నబడవచ్చని పేర్కొంది. బాధ్యతగా వ్యవహరించి రూ.10 కోట్ల  ఆఫర్‌ను వదిలేసుకున్న శిల్పపై సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తాయి.
 
తాజాగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా స్పందించారు. శిల్ప నిర్ణయం భేష్ అంటూ కొనియాడారు. స్లిమ్మింగ్ పిల్స్ ఫలితాలపై నమ్మకం లేని ఆమె బాధ్యతగా వ్యవహరించి రూ.10 కోట్ల ఆఫర్‌ను వదిలేసుకున్నారని, ఆమె తీరు అభినందనీయమని ప్రశంసించారు. సమాజం పట్ల ఆమెకున్న బాధ్యతకు ఇది నిదర్శనమని కొనియాడారు. మిగతా సెలబ్రిటీలు కూడా ఆమెను అనుసరించాలని కోరారు. అవాస్తవమైన ప్రచారాలకు సెలబ్రిటీలు దూరంగా ఉండాలని, వారు తీసుకునే నిర్ణయం సమాజానికి ఉపయోగపడుతుందని శివరాజ్ సింగ్ పేర్కొన్నారు.

More Telugu News