mika singh: పాకిస్థాన్‌లో ప్రదర్శన ఇచ్చినందుకు క్షమాపణలు చెప్పిన భారత సింగర్ మికా సింగ్

  • పర్వేజ్ ముషారఫ్ బంధువు పెళ్లిలో మికా సింగ్ ప్రదర్శన
  • ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నడుమ ప్రదర్శన ఇవ్వడంపై ఆగ్రహావేశాలు
  • తాను చేసింది తప్పేనన్న మికా సింగ్

భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో దాయాది దేశంలో ప్రదర్శన ఇచ్చిన భారతీయ సింగర్ మికాసింగ్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (ఎఫ్‌డబ్ల్యూఐసీఈ) మికా సింగ్‌పై నిషేధం కూడా విధించింది. నేపథ్య గీతాలు పాడడం, బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడంతోపాటు సినిమాల్లో నటించడంపైనా నిషేధం విధించింది. దేశంలో ఎక్కడా ప్రదర్శనలు ఇవ్వరాదని ఆదేశాలు జారీ చేసింది.

కరాచీలో పాక్ మాజీ సైనికాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కజిన్‌ కుమార్తెకు సంబంధించిన పెళ్లి వేడుకలో మికా సింగ్ ప్రదర్శన ఇవ్వడం తమను బాధించిందని ఎఫ్‌డబ్ల్యూఐసీఈ పేర్కొంది. తనపై నిషేధం విధించిన నేపథ్యంలో ఆదివారం మికాసింగ్ ఓ వీడియోను ట్వీట్ చేశాడు.

అందులో ఫెడరేషన్ అధ్యక్షుడు బీఎన్ తివారీ మాట్లాడుతూ.. మికా నుంచి ఓ లేఖ అందిందని పేర్కొన్నారు. తనపై ఫెడరేషన్ తీసుకున్న చర్యలను అంగీకరిస్తున్నట్టు మికా పేర్కొన్నాడని తివారీ తెలిపారు.  తాను తప్పు చేశానని, అందుకు ఈ దేశానికి క్షమాపణలు చెబుతున్నానని మికా పేర్కొన్నట్టు తివారీ వివరించారు. అయితే, తన వాదన వినకుండా తనపై నిషేధం విధించొద్దని మికా ఆ లేఖలో పేర్కొన్నట్టు తివారీ పేర్కొన్నారు. 

More Telugu News