Telangana: ‘తెలంగాణ’ ను పట్టించుకోని కేసీఆర్..రాయలసీమను రత్నాలసీమ చేస్తారట: బీజేపీ నేత లక్ష్మణ్

  • నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బీజేపీ బహిరంగ సభ
  • కేసీఆర్ పాలనలో పాఠశాలలు మూతపడ్డాయి
  • బార్లు, వైన్ షాపుల సంఖ్య పెరుగుతున్నాయి

‘తెలంగాణ’ ను పట్టించుకోని సీఎం కేసీఆర్..రాయలసీమను రత్నాలసీమ చేస్తారట అని టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న బీజేపీ భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ పాలనలో పాఠశాలలు మూతపడ్డాయని, బార్లు, వైన్ షాపుల సంఖ్య పెరుగుతున్నాయని, గ్రామాల్లో మంచినీళ్ల బిందెలు నిండటం లేదు కానీ, బీర్లు మాత్రం బాగానే దొరుకుతున్నాయని ఘాటు విమర్శలు చేశారు.

‘ఆరోగ్యశ్రీ’కు నిధులు లేక పేదలు ఇబ్బంది పడుతున్నారని, కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని తెలంగాణలో అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారని, గడచిన ఐదేళ్లలో 100 ఉపాధ్యాయ పోస్టులు కూడా భర్తీ చేయలేదని  అన్నారు. తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ విధానాలను ప్రశ్నించిన వారిని తెలంగాణ ద్రోహులుగా ముద్రవేస్తున్నారని దుమ్మెత్తిపోశారు. సచివాలయానికి రాని సీఎం..కొత్త సచివాలయం నిర్మిస్తామంటున్నారని కేసీఆర్ ఫై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ తో కలిసి లాలూచీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.

More Telugu News