Narendra Modi: భూటాన్‌లో భారత సహకారంతో నిర్మించిన జలవిద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించిన మోదీ

  • భారత్-భూటాన్ మధ్య 9 ఒప్పందాలు
  • హైడ్రో పవర్‌ సహకారానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్బంగా స్టాంపు విడుదల 
  • భూటాన్‌లో రూపే కార్డు విడుదల చేసిన మోదీ

భారత సహకారంతో భూటాన్‌లో నిర్మించిన మాంగ్‌డెచు జల విద్యుత్‌ కేంద్రాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించి భూటాన్ ప్రజలకు అంకితమిచ్చారు. ఆ దేశంలో నిర్మిస్తున్న కీలక ప్రాజెక్టుల్లో ఇది కూడా ఒకటి. 2020 నాటికి 10 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో మాంగ్‌డెచు కూడా ఒకటి. దీని సామర్థ్యం 720 మెగావాట్లు. రూ.4,500 కోట్లతో దీనిని నిర్మించారు.  

ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం మోదీ మాట్లాడుతూ.. భారత్-భూటాన్ మధ్య సహకారానికి జల విద్యుత్ కీలక రంగమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ప్రారంభంతో చారిత్రక మైలు రాయిని అధిగమించామన్నారు. ఇరు దేశాల సహకారంతో భూటాన్‌లో జల విద్యుత్‌ ఉత్పత్తి 2వేల మెగావాట్లు దాటిందని మోదీ వివరించారు.

అలాగే, భారత్‌లో మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన రూపే కార్డులను భూటాన్‌లో ప్రధాని మోదీ ప్రవేశపెట్టారు. సిమ్తోఖా డాంగ్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రూపే కార్డు ద్వారా మోదీ కొనుగోలు చేసి ఈ కార్డును లాంఛనంగా విడుదల చేశారు. కాగా, భారత్‌ - భూటాన్‌ మధ్య హైడ్రో పవర్‌ సహకారానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇరు దేశాల ప్రధానులు స్మారక స్టాంపులను విడుదల చేశారు. అనంతరం ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో 9 ఒప్పందాలపై అధికారులు సంతకం చేశారు.

More Telugu News