petrol: ఇక పెట్రోలు మీ ఇంటికే.. డోర్‌డెలివరీకి రంగం సిద్ధం!

  • ఇప్పటికే 35 నగరాల్లో డీజిల్ డోర్ డెలివరీ 
  • త్వరలోనే మరో 20 నగరాలకు విస్తరణ
  • పెసో అనుమతులు రాగానే పెట్రోలు కూడా

ఇకపై బంకులకు వెళ్లి పెట్రోలు కొట్టించుకునే బాధ తప్పుతుంది. ఇతర వస్తువుల్లానే పెట్రోలు కూడా డోర్ డెలివరీ కానుంది. ఇప్పటి వరకు డీజిల్‌కు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉండగా, ఇకపై పెట్రోలును కూడా డోర్ డెలివరీ ద్వారా వినియోగదారులకు అందించాలని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయించాయి. ప్రస్తుతం కొన్ని నగరాల్లో డీజిల్‌ను ప్రయోగాత్మకంగా డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇప్పుడు దీనిని మరో 20 నగరాలకు విస్తరించాలని హిందూస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వంటి సంస్థలు నిర్ణయించాయి.

ఇప్పటి వరకు ఒక్క డీజిల్‌కు మాత్రమే డోర్ డెలివరీకి అనుమతులున్నాయి. అయితే, త్వరలోనే పెట్రోలు కూడా పెట్రోలియం అండ్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ (పెసో) అనుమతులు వస్తాయని హెచ్‌పీసీఎల్‌ చైర్మన్ ఎం.కె.సురానా ఇటీవల పేర్కొన్నారు. ప్రస్తుతం 35 నగరాల్లో డీజిల్ డోర్ డెలివరీ సౌకర్యం అందుబాటులో ఉంది. భారీ పరిమాణంలో ఇంధనాన్ని కొనుగోలు చేసే వారిని ఉద్దేశించి ఈ సేవలను ప్రారంభించారు.

ముంబై లాంటి నగరాల్లో నెలకు 150 కిలో లీటర్ల డీజిల్‌ను డోర్ డెలివరీ చేస్తున్నారు. అయితే, 2 వేల లీటర్లకు మించి పెట్రోలు డోర్ డెలివరీ చేయాలంటే పెసో అనుమతి తప్పనిసరి. కాబట్టి దాని అనుమతుల కోసం సంస్థలు ఎదురుచూస్తున్నాయి. అనుమతులు రాగానే డోల్ డెలివరీని ప్రారంభించనున్నాయి. ఇందుకోసం వాహనాలను కూడా సిద్ధం చేసుకుంటున్నాయి.  

More Telugu News