Netharlands: చిన్నప్పుడు కానుక ఇచ్చిన వ్యక్తిని వెతికి పట్టుకున్న ట్వీట్!

  • 1990 దశకంలో శరణార్థిగా ఉన్న మేవాన్
  • నెదర్లాండ్స్ లో ఆమెకు గిఫ్ట్ ఇచ్చిన ఆర్జెన్
  • 24 ఏళ్ల తరువాత అతనెవరో తెలుసుకున్న మేవాన్

ఆమె పేరు మేవాన్ బబకర్. ప్రస్తుతం వయసు 29 సంవత్సరాలు. 1990 మొదట్లో ఆమె శరణార్థిగా నెదర్లాండ్స్ లోని ఓ శిబిరంలో కొంతకాలం ఉంది. అప్పుడామెకు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే. ఆ సమయంలో తల్లితో కలిసి శిబిరంలో ఉంటున్న ఆ చిన్నారికి, అక్కడ పనిచేస్తున్న ఓ అంకుల్ పరిచయమయ్యాడు. ప్రేమతో ఓ చిన్న బైక్ ను బహుమతిగా ఇచ్చాడు. అతను చూపిన ప్రేమాభిమానాలతో మేవాన్ మనసు సంతోషంతో నిండిపోయింది.

ఆపై తన స్వదేశంలో పరిస్థితి సద్దుమణగడంతో తల్లితో కలిసి సొంత దేశానికి వెళ్లిపోయింది. రెండు పుష్కరాలు గడిచాయి. తాను చిన్న వయసులో ఉన్న వేళ, తనకు బహుమతిని ఇచ్చిన అతన్ని కలుసుకోవాలని మేవాన్ భావించింది. నెదర్లాండ్స్ లోని తాను ఉన్న శిబిరం ప్రాంతానికి వెళ్లి విచారించినా ఫలితం లేకపోయింది. ఇక సోషల్ మీడియా మాత్రమే తనను ఆదుకుంటుందని భావించిన ఆమె, ఈ నెల 12వ తేదీన ఓ ట్వీట్ పెడుతూ ట్విట్టర్ ను ఆశ్రయించింది.

"హాయ్ ఇంటర్నెట్... ఇది ఎన్నో సంవత్సరాలనాటి మాట. నేను 1990వ దశకంలో ఐదేళ్ళపాటు శరణార్థిగా ఉన్నాను. నేను పోస్ట్ చేసిన ఫోటోలో ఉన్న అతను నెదర్లాండ్స్‌లోని శిబిరం వద్ద పనిచేసేవారు. అతను నాకు ఓ బైక్ కొనిచ్చారు. ఆ సమయంలో ఐదేళ్ల నా పసి హృదయం సంతోషంతో ఉప్పొంగింది. నేను ఆయన పేరు, వివరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అతన్ని నేను కలవాలి. మీరు సహాయపడతారా?’’ అని కోరింది.

ఇక ఈ ట్వీట్ వైరల్ అయింది. వేల మంది రీట్వీట్ చేశారు. ఆమెను మీడియా కలిసి, పత్రికల్లో కథనాలు రాసింది. ఆపై ఆమె కోరిక నెరవేరింది. మేవాన్ ట్వీట్ చేసిన 20 గంటల వ్యవధిలోనే ఆ వ్యక్తిని ట్విట్టర్ గుర్తించింది. ఆర్జెన్ అనే అతను తనకు బైక్ ను కొనిచ్చాడని తెలుసుకుంది. అతనే ట్విట్టర్ లో ప్రచారాన్ని చూసి, మేవాన్ కుటుంబంతో మాట్లాడారు. ఈ విషయాన్ని ఇంకో ట్వీట్ లో తెలిపిన మేవాన్, ఆ సమయంలో ఎంతో మంది శరణార్ధులకు ఆర్జెన్ సాయం చేశారని, వారిలో కొందరు తనకు కాంటాక్ట్ లోకి వచ్చారని చెప్పింది. ఇప్పుడు తామంతా ఓ కుటుంబమైపోయామని సంబరపడింది.

More Telugu News