Guntur District: సెల్లెత్తుకెళ్లిన కొండముచ్చు... పోలీసుల వద్ద లబోదిబోమన్న బాధితుడు!

  • గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఘటన
  • ఆరటిపళ్లు ఇచ్చినా మొబైల్ ను వదలని మర్కటం
  • తాము మాత్రం ఏమి చేస్తామన్న పోలీసులు

తానున్న ప్రాంతంలో ఆహారం దొరకకపోతే, ఏ జంతువైనా కొండలను, అడవులను వదిలేసి గ్రామాల్లోకి జొరబడతాయి. ఈ విషయంలో మినహాయింపు లేని ఓ కొండముచ్చు, ఊర్లోకి వచ్చి, ఓ వ్యక్తి కొత్తగా కొనుక్కున్న సెల్ ఫోన్ ను పట్టుకెళ్లింది. ఆపై దాన్ని ఆసక్తిగా చూస్తూ, ఆడుకుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, సెల్ ఫోన్ ను అది ఇవ్వక పోవడంతో, బాధితుడు పోలీసులను ఆశ్రయించి బోరుమన్నాడు.

ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగింది. ఎస్కే చాంద్ బాషా అనే వ్యక్తి, వారం కిందటే రూ. 12 వేలు పెట్టి సెల్ ఫోన్ కొన్నాడు. అతని ఇంట్లోకి చొరబడిన ఓ కొండముచ్చు, చేతిలో ఉన్న సెల్‌ ఫోన్‌ లాక్కెళ్లింది. కొండముచ్చును వెంబడించిన చాంద్‌ బాషా, దానికి అరటిపళ్లు వేశాడు. ఆ పళ్లను తిన్న కొండముచ్చు, సెల్ ఫోన్ ను మాత్రం ఇవ్వలేదు. ఫోన్ రింగ్ అవుతూ ఉంటే, మరింత ఆసక్తిగా దాన్ని చూసిందే తప్ప వదిలి పెట్టలేదు. దీంతో రెండు గంటలు ప్రయత్నించిన చాంద్ బాష్, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుతో అవాక్కైన పోలీసులు.. తాము మాత్రం ఏం చేయగలమని అంటూ, కొండముచ్చును కనిపెట్టి ఉండాలని, అది సెల్ ఫోన్ ను వదలగానే తెచ్చుకోవాలని ఉచిత సలహా ఒకటి పారేశారు. 

More Telugu News