Crime News: ఇంద్రకీలాద్రిపై భక్తుల ముసుగులో దొంగల హల్‌ చల్‌

  • భక్తులతో కలిసిపోయి చేతివాటం
  • బ్యాగులు, పర్సులు కొట్టేస్తున్న కేటుగాళ్లు
  • పోలీసుల అదుపులో రెండు ముఠాలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరి ఉన్న కనకదుర్గమ్మ సన్నిధిలో భక్తుల ముసుగులో చోరీలకు పాల్పడుతున్న ముఠాని పోలీసులు వలవేసి పట్టుకున్నారు. భక్తుల వేషంలో క్యూలైన్లలో చేరి వీలు చిక్కినప్పుడు వారి బ్యాగులు, పర్సులు కొట్టేస్తున్న ఈ ముఠా సభ్యుల ఆటకట్టించారు. పోలీసుల కథనం మేరకు...ఆషాఢం, శ్రావణం నెలల్లో అమ్మవారి సన్నిధి భక్తులతో కిటకిటలాడుతుంది. దీంతో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఓ చిన్నారితో కూడిన రెండు ముఠాలు ఆషాఢం ప్రారంభంలోనే కొండకు చేరుకున్నారు. ప్రారంభం రోజు నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్తున్నట్లు నటిస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఓ రోజు ఒకేసారి మూడు చోరీలు జరగడం, భక్తుల నుంచి ఫిర్యాదులు రావడంతో పోలీసులు అప్రమత్తమై నిఘాపెట్టారు.

నిన్న మధ్యాహ్నం దుర్గగుడి సీసీ కెమెరాల్లో సీసీఎస్‌ పోలీసులు, దేవస్థానం సిబ్బంది ముఠా సభ్యులను గుర్తించారు. రద్దీ వేళల్లో భక్తులతో కలిసిపోయి వీరు చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. మల్లికార్జున మండపం ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరిని అదుపులోకి తీసుకున్నారు.  ఈ ముఠా సభ్యులు ఇక్కడ చోరీలకు పాల్పడడమేకాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా దోపిడీలకు పాల్పడినట్లు గుర్తించారు.

More Telugu News