Jammu And Kashmir: ఆశ చావని పాకిస్థాన్‌...చైనా మద్దతు మాకే అంటూ ప్రగల్బాలు

  • పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ ప్రకటన
  • ఐక్యరాజ్య సమితిలో మద్దతు ఇస్తుందని ఆశాభావం
  • కశ్మీర్‌ సమస్య ద్వైపాక్షికమని ఇప్పటికే ప్రకటించిన చైనా

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న 370వ రాజ్యాంగ అధికరణను భారత్‌ పార్లమెంటు రద్దుచేసిన తర్వాత తమకేదో అన్యాయం జరిగిపోయిందంటూ గుండెలు బాదుకుంటున్న దాయాది పాకిస్థాన్‌ ఇంకా తన వక్రబుద్ధిని కొనసాగిస్తూనే ఉంది. కశ్మీర్‌ ద్వైపాక్షిక అంశమని, ఇరుదేశాలు చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని ఇప్పటికే తన మిత్రదేశం చైనా స్పష్టంగా చెప్పినా ఆశ చావని పాకిస్థాన్‌ ఐక్యరాజ్య సమితిలో చైనా మద్దతు తమకేనంటూ ప్రగల్బాలు పలుకుతోంది.

పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ మాట్లాడుతూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని ఆశ్రయించనున్నామని, తమ ప్రయత్నానికి చైనా పూర్తి మద్దతు ప్రకటించిందని తెలిపారు. నిన్న చైనాలో పర్యటించిన ఖురేషీ ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్‌ ఈతో భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడుతూ కశ్మీర్‌ విషయంలో భారత్‌ ఏకపక్షంగా వ్యవహరించిందన్న తమ వాదనకు చైనా మద్దతు తెలిపిందని చెప్పుకొచ్చారు.

భారత్‌ విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఈరోజు చైనాలో పర్యటించనున్న తరుణంలో ఖురేషీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా, భారత్‌ 370 అధికరణ రద్దు చేసిన వెంటనే కయ్యానికి కాలుదువ్విన పాకిస్థాన్‌ ప్రపంచ దేశాల నుంచి ఎటువంటి సానుకూలత వ్యక్తం కాకపోవడంతో అనంతరం వెనక్కితగ్గింది. ఎట్టిపరిస్థితుల్లోనూ మిలటరీ చర్యకు దిగబోమని, భారత్‌ దిగితే మాత్రం తిప్పికొడతామని ప్రకటిస్తోంది.

More Telugu News