Krishna River: ముప్పేట వరదతో కృష్ణమ్మ మహోగ్రరూపం!

  • మహాబలేశ్వర్ పర్వత ప్రాంతాల్లో భారీ వర్షం
  • 2009 తరువాత భారీ వరద
  • ఆరున్నర లక్షల క్యూసెక్కులు దాటిన ప్రవాహం

మహాబలేశ్వర్ పర్వత ప్రాంతాలతో పాటు కర్ణాటకలో వర్షాలు కొనసాగుతూ ఉండటంతో, కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చింది. 2009 తరువాత ఆ స్థాయిలో వరద ప్రవాహం నమోదైంది. ఈ ఉదయం జూరాల నుంచి ఆరున్నర లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. కృష్ణానదితో పాటు భీమా, తుంగభద్రల నుంచి కూడా వరద పెరగడంతో, శ్రీశైలం మీదుగా నాగార్జున సాగర్ కు చేరే వరద నేడు మరింతగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులన్నీ వచ్చిన నీటిని వచ్చినట్టు విడుదల చేస్తుండటంతో సాగర్ కు భారీగా నీరు వస్తోంది. మూడు వైపుల నుంచి వరద వస్తుండటంతో కృష్ణానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇప్పటికే 10 గేట్లను అధికారులు ఎత్తగా, మిగతా గేట్లను సైతం నేడు ఎత్తివేయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, 2009-10 సీజన్ లో వచ్చిన వరదలకు 1,220 టీఎంసీల నీరు రాగా, ఈ సీజన్ లో ఆ రికార్డు బద్ధలు కావచ్చని భావిస్తున్నారు.

More Telugu News