Jagan: పాఠశాలల సదుపాయాలపై మళ్లీ ఫొటోలు తీసి ప్రజలకు చూపించండి: సీఎం జగన్

  • విద్యాశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం
  • పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై అధికారులకు సూచనలు
  • టీచర్ల నియామకం కోసం క్యాలెండర్ రూపొందించాలంటూ ఆదేశాలు

ఏపీ సీఎం జగన్ ఇవాళ విద్యాశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలోని పాఠశాలల తీరుతెన్నులపై అధికారులతో చర్చించారు. స్కూళ్లను అందంగా తీర్చిదిద్దాలని ఆయన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, అధికారులకు సూచించారు. టాయిలెట్లు, ఫ్యాన్లు, తాగు నీరు, ఉల్లాసం కలిగించే వర్ణ చిత్రాలు, ఫర్నిచర్, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

ఇప్పటివరకు రాష్ట్రంలోని స్కూళ్లను ఫొటోలు తీసి అప్ లోడ్ చేశామని మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పగా, పూర్తిస్థాయిలో సౌకర్యాల కల్పన జరిగిన తర్వాత మరోసారి ఫొటోలు తీసి వాటిని ప్రజలకు చూపించాలని జగన్ ఆదేశించారు. తద్వారా ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు సదవగాహన కలిగేలా చేయాలని చెప్పారు.

కాగా, పలు స్కూళ్లలో అన్ని తరగతులకు ఒక్కరే టీచర్ ఉండడం పట్ల జగన్ విస్మయం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా ఉపాధ్యాయుల సంఖ్య ఉండాల్సిందేనని పేర్కొన్న ఆయన, రాష్ట్రంలో టీచర్ల నియామకం కోసం క్యాలెండర్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

More Telugu News