Nama Nageswar Rao: పాక్ ఆక్రమిత కశ్మీర్ ను భారత్ వెంటనే స్వాధీనం చేసుకోవాలి: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు

  • మోదీ, అమిత్ షా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు
  • పీవోకే అని కాకుండా ఇకపై ఐకే అని పిలవాలి
  • జమ్ముకశ్మీర్ విభజన బిల్లుకు మద్దతు ప్రకటిస్తున్నాం

జమ్ముకశ్మీర్ బిల్లుతో కశ్మీర్ ప్రజలకు పూర్తి న్యాయం జరుగుతుందని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. లోక్ సభలో జమ్ముకశ్మీర్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కశ్మీర్ విభజన బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు పలుకుతోందని చెప్పారు. జమ్ముకశ్మీర్ విషయంలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని కితాబిచ్చారు. కొన్ని సందర్భాల్లో చారిత్రక తప్పిదాలు జరుగుతుంటాయని... వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం వుంటుందని చెప్పారు.

బిల్లుపై అమిత్ షా మాట్లాడుతూ పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) గురించి ప్రస్తావించారని... పీవోకే అని కాకుండా ఐకే (ఇండియన్ కశ్మీర్) అని ఇకపై పిలిస్తే బాగుంటుందని నామా అన్నారు. పీవోకేను భారత్ స్వాధీనం చేసుకోవాలని చెప్పారు. జమ్ముకశ్మీర్ బిల్లుకు మద్దతు పలకకపోతే పెద్ద తప్పు చేసినవారమవుతామని... అలాంటి పార్టీలను ప్రజలు దేశ ద్రోహులుగా చూస్తారని అన్నారు.

రానున్న రోజుల్లో కశ్మీర్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని నామా చెప్పారు. ఐదేళ్లలో కశ్మీర్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని అమిత్ షా చెప్పారని... అందుకే ఈ బిల్లుకు తాము మద్దతు పలుకుతున్నామని తెలిపారు. కశ్మీర్ ప్రజలు ఎంతో మంచి వారని... ఈ బిల్లుతో వారికి అంతా మంచే జరుగుతుందని చెప్పారు.

More Telugu News