Jammu And Kashmir: ఆర్టికల్ 370 రద్దు బిల్లుకు రాజ్యసభ ఆమోదం

  • స్లిప్పులతోనే ఓటింగ్ ప్రక్రియ 
  • బిల్లుకు అనుకూలంగా 125 ఓట్లు
  • వ్యతిరేకంగా 61 ఓట్లు

జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించింది. దీంతో, ఆర్టికల్ 370 రద్దు తీర్మానానికి రాజ్యసభ ఆమోదం లభించినట్టయింది. ఈ తీర్మానం బిల్లుకు అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 61 ఓట్లు లభించగా, ఒక ఓటు తటస్థంగా ఉంది. జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని విభజించి  రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది. అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్ము-కశ్మీర్, అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ఏర్పడనున్నాయి.

బిల్లుపై డివిజన్ ఓటింగ్ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ కోరడంతో, అందుకు, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అంగీకరించారు. అయితే, సాంకేతిక కారణాలు తలెత్తడంతో ఆటోమేటిక్ ఓటింగ్ రికార్డింగ్ వ్యవస్థ పని చేయలేదు. దీంతో, స్లిప్పులతోనే ఓటింగ్ ప్రక్రియను చేపట్టారు. అంతకుముందు,  జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సుదీర్ఘ వివరణ ఇచ్చారు. కాగా, రాజ్యసభలో ఆమోదం పొందిన ఈ బిల్లు రేపు లోక్ సభ ముందు ప్రవేశపెట్టనున్నారు.

స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ తెచ్చిన ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ సహా తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ తృణమూల్, జేడీయూ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రభుత్వానికి మద్దుతుగా బహుజన్ సమాజ్ పార్టీ, బిజూ జనతా దళ్, టీడీపీ, వైసీపీ, ఆప్ నిలిచాయి.  

తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 13 మంది సభ్యులు, ఎన్డీఏ కూటమిలోని జేడీయూకు చెందిన ఆరుగురు సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రతిపాదించిన వెంటనే నిరసన వ్యక్తం చేస్తూ, రాజ్యాంగ ప్రతులను చించేసిన పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ)కి చెందిన ఇద్దరు సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు.

More Telugu News