Jammu And Kashmir: పాక్ కుట్రపూరిత చర్యలకు కశ్మీర్ యువత బలైంది: అమిత్ షా

  • కశ్మీర్ లో ఉగ్రవాదం పోవాలంటే ఈ ఆర్టికల్  రద్దు తప్పదు
  • స్వతంత్ర భారతంలో ఈ ఆర్టికల్ ను  కదిపే సాహసం ఎవరూ చేయలేదు
  • ఆర్టికల్ 370 కోసం పట్టుబట్టే వారి పిల్లలు ఎక్కడున్నారో గుర్తుచేసుకోవాలి?

కశ్మీర్ స్థానిక యువతలో విద్వేష బీజాలు నాటి పెంచారని, పాకిస్థాన్ కుట్ర పూరితంగా సాగించిన చర్యలకు ఇక్కడి యువత బలయ్యారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుపై అమిత్ షా రాజ్యసభలో వివరణ ఇస్తూ.. ‘ఉగ్రవాదం’ అనే విషవృక్షాన్ని పెకిలించేందుకే కశ్మీర్ లో ఈ పరివర్తన ప్రయత్నాలు చేస్తున్నామని, ఆర్టికల్ 370 రద్దుతో అవన్నీ సాధ్యమవుతాయని చెప్పారు.

ఈ ఆర్టికల్ ఉన్నంత వరకూ కశ్మీర్ యువత భారత్ లో కలవదని పాక్ నేత జియావుల్ హక్ ఆనాడే చెప్పారని గుర్తుచేశారు. పాక్ ప్రేరేపిత వేర్పాటువాదుల వల్లే ఈ సమస్య తలెత్తిందని విమర్శించారు. ఆర్టికల్ 370 కోసం పట్టుబట్టే వారి పిల్లలు ఎక్కడున్నారో గుర్తుచేసుకోవాలని సూచించారు. వేర్పాటువాదుల పిల్లలంతా అమెరికా, ఇంగ్లాండు లలో చదువుకుంటున్నారని విమర్శించారు. జమ్ముకశ్మీర్ యువతకు మంచి భవిష్యత్తు అందించాలని అనుకుంటున్నామని, కశ్మీర్ లో ఉగ్రవాదం పోవాలంటే ఈ ఆర్టికల్ రద్దు తప్పదని స్పష్టం చేశారు.

డెబ్బై ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎవరూ ఈ ఆర్టికల్ ను కదిపే సాహసం చేయలేదని, ఒక తాత్కాలిక ఆర్టికల్ ను ఇలా ఎన్నాళ్లు కొనసాగిస్తారని ప్రశ్నించారు. నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ విలీనం చేసిన సంస్థానాలన్నీ ఈరోజు భారత్ లో అంతర్భాగంగా ఉన్నాయని, ఆ సంస్థానాల్లో ఎక్కడా ఆర్టికల్ 370 అమల్లో లేదని అన్నారు. ఆర్టికల్ 370 వల్లే జమ్ముకశ్మీర్ విలీనం జరిగిందన్న వాదన తప్పని, ఆ ఆర్టికల్ లేకుంటే భారత్ నుంచి జమ్ముకశ్మీర్ విడిపోతుందని అంటున్నారని, అవన్నీ భ్రమలేనని, అందులో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు.

More Telugu News