Jammu And Kashmir: ఢిల్లీలో మొదలైన ‘కశ్మీర్‌’ హడావుడి.. కాసేపటిలో కేంద్ర మంత్రి వర్గం భేటీ

  • కశ్మీర్‌ అంశంపై చర్చే ప్రధాన అజెండా
  • హాజరుకానున్న కేంద్రమంత్రులు, జాతీయ భద్రతా సలహాదారు
  • తొలుత మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం

సరిహద్దు రాష్ట్రం జమ్ముకశ్మీర్‌లో హైటెన్షన్‌ నేపధ్యంలో ఢిల్లీలో ఈరోజు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుండడం పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. జమ్ము కశ్మీర్‌లో అసలేం జరుగుతోంది? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370, 35-ఏ ద్వారా ప్రత్యేక హక్కులు పొందుతున్న రాష్ట్రం విషయంలో అసలు కేంద్రం మనసులో మాట ఏమిటి? హఠాత్తుగా కశ్మీర్‌లో ఇంతటి ఉద్రిక్త పరిస్థితులకు కారణం ఏమిటి?...ఇలా ఒక్కొక్కరి మనసును ఒక్కో ప్రశ్న తొలిచేస్తున్నా దేనిపైనా కేంద్రం స్పష్టమైన వివరణ మాత్రం ఇంతవరకు ఇవ్వలేదు.

రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలన్నది కేంద్రం ఉద్దేశమని, ఇందుకు సంబంధించిన బిల్లును ఈ రోజు పార్లమెంటులో ప్రవేశపెడుతుందని చెబుతున్నారు. ఇందుకోసమే ఈ హడావుడి అంతా అన్న విమర్శల నేపథ్యంలో ఈరోజు ఢిల్లీలో జరగనున్న కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని నరేంద్రమోదీ నివాసంలో మరికాసేపటిలో జరగనున్న సమావేశానికి కేంద్రమంత్రులతోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్‌ కూడా హాజరుకానుండడం ప్రాధాన్యాన్ని చెప్పకనే చెబుతోంది.

ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపైనే ప్రధానంగా చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా, ఒమర్‌ అబ్దుల్లాను ప్రభుత్వం గృహ నిర్బంధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలు చేయడమేకాక, ఈరోజు నుంచి విద్యా సంస్థలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ నేపథ్యంలో జరగనున్న కేంద్రమంత్రి వర్గ సమావేశం, అంతకు ముందు జరగనున్న మంత్రి వర్గ ఉపసంఘం సమావేశాల్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, విభజన ఊహాగానాలను నిజం చేస్తారా? అన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది.

More Telugu News