Andhra Pradesh: విశాఖపట్నంలో విద్యార్థినులకు లైంగిక వేధింపులు.. ఇద్దరు టీచర్లను సెలవుపై పంపిన ఉన్నతాధికారులు!

  • విశాఖలోని అనంతగిరి మండలంలో ఘటన
  • గిరిజన సంక్షేమ స్కూలులో ఇద్దరు టీచర్ల నిర్వాకం
  • విచారణకు ఆదేశించిన ఐటీడీఏ ఉన్నతాధికారులు

విద్యాబుద్ధులు నేర్పించి పిల్లలను ఆదర్శపౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఇద్దరు ఉపాధ్యాయులు వక్రమార్గం పట్టారు. కన్నబిడ్డల్లాంటి విద్యార్థులను లైంగికంగా వేధించుకుతిన్నారు. చివరికి బాలికలు ధైర్యం చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో సదరు కామాంధులను విధుల నుంచి తప్పించి సెలవుపై పంపారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని అనంతగిరి మండలం గిరిజన సంక్షేమ హైస్కూలులో 61 మంది బాలికలు సహా 440 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి పాఠాలు చెప్పేందుకు నలుగురు పురుష, 8 మంది మహిళా టీచర్లు ఉన్నారు. అయితే వీరిలో ఇద్దరు మగ టీచర్లు పదో తరగతి అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్నారు. గత కొద్దిరోజులుగా సాగుతున్న ఈ తతంగంపై అమ్మాయిలు భయంతో మౌనంగా ఉండిపోయారు. అయితే ఈ వేధింపులు శ్రుతిమించడంతో స్థానిక కమ్యూనిస్టు నాయకులతో కలిసి విద్యార్థినులు ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ(ఐటీడీఏ) అధికారులకు ఫిర్యాదు చేశారు.

వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు ఇద్దరు టీచర్లను సెలవుపై పంపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ విషయమై అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఇద్దరు ఉపాధ్యాయులు దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో శాంతించిన విద్యార్థులు, గ్రామస్తులు ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోయారు. ఈ పాఠశాలను ఐటీడీఏనే నిర్వహిస్తోంది.

More Telugu News