Haryana: హరియాణాలో పాక్ కుట్ర భగ్నం.. ముగ్గురు ఐఎస్ఐ గూఢచారుల అరెస్ట్!

  • హిస్సార్ లోని ఆర్మీ కంటోన్మెంట్ లో కార్మికులుగా ప్రవేశం
  • కంటోన్మెంట్ వివరాలను ఐఎస్ఐకి చేరవేస్తున్న నిందితులు
  • తమ పిల్లలు అమాయకులు అంటున్న బాధిత కుటుంబాలు

జమ్మూకశ్మీర్ లో 35,000 మంది బలగాల మోహరింపుతో టెన్షన్ వాతావరణం నెలకొన్నవేళ కీలక ఘటన చోటుచేసుకుంది. హరియాణాలోని హిస్సార్ ప్రాంతంలో ముగ్గురు పాక్ గూఢచారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా హిస్సార్ లోని ఆర్మీ కంటోన్మెంట్ భవన నిర్మాణ కార్మికులుగా నటిస్తూ ఇక్కడి సమాచారాన్ని, ఆర్మీ కదలికల్ని పాక్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)కు చేరవేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇందుకోసం వాట్సాప్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా యాప్ లను వాడుతున్నారని వెల్లడించారు.

వీరిలో ఇద్దరిది ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ కాగా, మరొకరిది షామ్లీ జిల్లా అని పేర్కొన్నారు. అయితే తమ పిల్లలు గూఢచారులు కాదనీ, భవన నిర్మాణ కార్మికులు మాత్రమేనని ఈ ముగ్గురి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అనుకోకుండా సరదాగా ఫొటోలు తీయడంతో వారిపై గూఢచారి అని ముద్రవేశారని కన్నీరుమున్నీరు అవుతున్నారు. తమ పిల్లలు అమాయకులనీ, వారిని విడిచిపెట్టాలని కోరుతున్నారు. దాదాపు 10 రోజుల క్రితం భారత ఆర్మీ కదలికలపై నిఘా పెట్టి ఐఎస్ఐకి సమాచారం అందజేస్తున్న ఓ రైల్వే ఉద్యోగిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

More Telugu News