maldives: సరుకుల ఓడలో చట్టవ్యతిరేకంగా తూత్తుకుడికి మాల్దీవుల మాజీ ఉపాధ్యక్షుడు.. తిరిగి స్వదేశానికి అప్పగింత

  • అదీబ్‌పై హత్యాయత్నం, అవినీతి ఆరోపణలు
  • 15 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
  • వచ్చిన ఓడలోనే తీసుకెళ్లి అప్పగించిన భారత్

మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్ గయూమ్‌పై హత్యాయత్నానికి కుట్ర పన్నడంతోపాటు పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ దేశ మాజీ ఉపాధ్యక్షుడు అహ్మద్ అదీబ్ అబ్దుల్ గఫూర్‌ చట్ట వ్యతిరేకంగా భారత్ చేరుకున్నారు. ఓ సరుకు రవాణా నౌకలో చట్ట వ్యతిరేకంగా తూత్తుకుడి తీరానికి చేరుకున్న ఆయనను అదుపులోకి తీసుకున్న సముద్ర తీర భద్రతా దళం అధికారులు శుక్రవారం అర్ధరాత్రి స్వదేశం మాల్దీవులకు తరలించారు.

ఆయన వచ్చిన విర్గో-9 సరుకుల ఓడలోనే తిరిగి ఆయనను స్వదేశానికి తరలించిన భారత అధికారులు అంతర్జాతీయ సముద్ర జలాల సరిహద్దు ప్రాంతంలో మాల్దీవుల భద్రతాదళం అధికారులకు అప్పగించారు. ఆ ఓడలో ఆయనతోపాటు మరో 9 మంది ఉన్నారు. కాగా, అధ్యక్షుడిపై హత్యాయత్నం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

మాల్దీవులలో ప్రస్తుతం కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో అదీబ్‌కు విధించిన జైలు శిక్షను రద్దు చేసి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించింది. ఇందులో భాగంగా అదీబ్‌ను గృహ నిర్బంధంలో ఉంచాలని ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, ఆయన మాత్రం భారత పౌరసత్వం కోరుతూ మాల్దీవులకు చెందిన ఓ వ్యాపారి సరుకు రవాణా ఓడలో తూత్తుకుడికి పయనమయ్యారు. సమాచారం అందుకున్న భారత సముద్రతీర భద్రతాదళం అధికారులు గురువారం ఆయనను నిర్బంధించారు. శుక్రవారం అర్ధరాత్రి ఆయనను స్వదేశానికి అప్పగించారు. అదీబ్‌ను అదుపులోకి తీసుకున్న తర్వాత జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఏ), క్యూబ్రాంచి, రా వంటి దర్యాప్తు సంస్థలు ఆయనను విచారించాయి.  

More Telugu News