మహాభారత యుద్ధానికి ముందు కూడా మధ్యవర్తిత్వం జరిగింది: యోగి ఆదిత్యనాథ్

03-08-2019 Sat 15:53
  • అయోధ్య విషయంలో మధ్యవర్తిత్వం విఫలమైంది
  • మధ్యవర్తిత్వం వల్ల ఫలితాలు రావనే విషయం మాకు ముందే తెలుసు
  • మహాభారత యుద్ధానికి ముందు చేసిన మధ్యవర్తిత్వం కూడా విఫలమైంది
అయోధ్య అంశంపై సుప్రీంకోర్టు నియమించిన మధ్యవర్తిత్వం విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ నెల 6వ తేదీ నుంచి అయోధ్య కేసుకు సంబంధించి ప్రతి రోజు వాదనలను వింటామని సుప్రీంకోర్టు ప్రకటించింది. దీనిపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ, మధ్యవర్తిత్వం ద్వారా ఎలాంటి ఫలితాలు రావనే విషయం తమకు ముందే తెలుసని చెప్పారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విఫలమైందని తెలిపారు. అయినప్పటికీ మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం కోసం ప్రయత్నించడం మంచిదేనని చెప్పారు. మహాభారత యుద్ధానికి ముందు కూడా మధ్యవర్తిత్వం జరిగిందని... అయినప్పటికీ ఫలితం దక్కలేదని... ఈ విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు.