Jammu And Kashmir: గవర్నర్ చెబితే సరిపోదు.. కేంద్ర ప్రభుత్వం చెప్పాలి: ఒమర్ అబ్దుల్లా

  • ఆర్టికల్ 35A ను రద్దు చేయబోమని గవర్నర్ చెప్పారు
  • దీనిపై నిర్ణయం తీసుకునేది గవర్నర్ కాదు
  • కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది

జమ్ముకశ్మీర్ కు ఉన్న స్పెషల్ స్టేటస్ ను తొలగించబోమని గవర్నర్ సత్యపాల్ మాలిక్ చెప్పారని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఈ మధ్యాహ్నం గవర్నర్ తో ఒమర్ అబ్దుల్లా భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఆర్టికల్ 35A ను రద్దు చేయరనే విషయాన్ని గవర్నర్ చెబితే సరిపోదని... ఇదే విషయాన్ని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.

'ఆర్టికల్ 35A లేదా ఆర్టికల్ 370లను రద్దు చేయబోమని గవర్నర్ చెప్పారు. జమ్ముకశ్మీర్ పై తుది నిర్ణయం తీసుకునేది గవర్నర్ కాదు. భారత ప్రభుత్వం దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటుంది. అందుకే ఇదే సమాధానాన్ని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం నుంచి వినాలనుకుంటున్నాం' అని ఒమర్ అబ్దుల్లా అన్నారు.

టెన్షన్ వాతావరణంలో జమ్ముకశ్మీర్ ఉండాలని ఎవరూ కోరుకోరని... ప్రశాంతంగానే ఉండాలని కోరుకుంటారని... కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే చేస్తుందని భావిస్తున్నట్టు అబ్దుల్లా తెలిపారు.

More Telugu News