Nagarjuna: నాగార్జున వ్యాఖ్యలు నన్ను చాలా బాధించాయి: తమ్మారెడ్డి భరద్వాజ

  • బిగ్ బాస్ షోలో నాగేశ్వరరావుగారి గురించి మాట్లాడటం బాధాకరం
  • కుటుంబసభ్యుల మధ్య ఆత్మీయతలు ఉండాలనేది నాగేశ్వరరావుగారి వ్యక్తిత్వం
  • బిగ్ బాస్ పూర్తిగా కమర్షియల్ ప్రక్రియ

నాగేశ్వరరావుగారు జాతీయ సంపద అని... ఆయన గురించి బిగ్ బాస్ లాంటి పిచ్చి షోలలో మాట్లాడటం సరికాదని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. బిగ్ బాస్ -3 మొదటి ఎపిసోడ్ చూశానని... కంటెస్టెంట్స్ ఎవరున్నారో చూద్దామనుకున్నానని ఆయన తెలిపారు. ఇంట్రడక్షన్ లో నాగార్జున మాట్లాడుతూ, నాన్న నాగేశ్వరరావు ఉన్నప్పుడు కుటుంబంలోని మొత్తం 30 మంది కచ్చితంగా ప్రతి ఆదివారం ఇంటికి రావాలనే ఆంక్ష పెట్టారని... అందువల్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆదివారాలు కలుసుకునేవారమని అన్నారని... ఇది చాలా గొప్ప విషయమని అన్నారు. విలువలు కోల్పోకూడదనేది నాగేశ్వరరావుగారి వ్యక్తిత్వమని, కుటుంబసభ్యుల మధ్య ఆత్మీయతలు ఎప్పటికీ ఉండిపోవాలనేది ఆయన ఆకాంక్ష అని చెప్పారు.

షోలో నాగార్జున మాట్లాడుతూ, మేము 30 మంది కలిసుండేవారమని, బిగ్ బాస్ హౌస్ లో 15 మంది కలిసి ఉంటున్నారని అన్నారని... కుటుంబంతో బిగ్ బాస్ షోను పోల్చడం తనను బాధించిందని తమ్మారెడ్డి అన్నారు. నాగేశ్వరరావుగారి ఆలోచన బిగ్ బాస్ కాదని, ఆయన ఇళ్లు బిగ్ బాస్ హౌస్ కాదని చెప్పారు. ఆత్మీయ కలయిక కోసం ఆయన అలా చేసేవారని అన్నారు. బిగ్ బాస్ కమర్షియల్ ప్రోగ్రాం అని అన్నారు. గెలవడం కోసం, డబ్బు కోసం చేసే ప్రక్రియ బిగ్ బాస్ అని తెలిపారు. ఈ స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారో తనకు తెలియదని... కానీ, నాగార్జున అయినా కొంచెం ఆలోచించి ఉండాల్సిందని అన్నారు. ఫ్యామిలీని షోతో పోల్చడం తనను బాధించిందని చెప్పారు. మరోసారి నాగార్జున ఇలా చేయరని భావిస్తున్నానని చెప్పారు.

More Telugu News