అప్పుడు ముద్దులు పెట్టి.. ఇప్పుడు వాతలు పెడుతున్నారు: జగన్‌పై డొక్కా ఫైర్

01-08-2019 Thu 08:46
  • గుంటూరులో టీడీపీ నిరసన ప్రదర్శన
  • జగన్ తన 60 రోజుల పాలనలో 60 తప్పులు చేశారన్న డొక్కా
  • రాష్ట్రంలో సిమెంటు ధర కంటే ఇసుక ధర ఎక్కువని ఆవేదన
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ విరుచుకుపడ్డారు. ఒక్క అవకాశం ఇవ్వాలని బతిమాలుకుంటే ఎలా పరిపాలిస్తాడో అని ఓట్లేసిన ప్రజలకు జగన్ బాగానే బుద్ధి చెబుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుకు నిరసనగా బుధవారం గుంటూరులోని లాడ్జి సెంటర్‌లో టీడీపీ నిరసన ప్రదర్శన చేపట్టింది.

ఈ సందర్భంగా డొక్కా మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలు చేస్తూ ముద్దులు పెట్టిన జగన్.. అధికారంలోకి వచ్చాక వాతలు పెడుతున్నారని అన్నారు. అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ తన 60 రోజుల పాలనలో 60 తప్పులు చేశారని ఆరోపించారు. జగన్‌కు అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రాన్ని 50 ఏళ్లు వెనక్కి నెట్టేస్తున్నారని అన్నారు. ఆయన పాలనలో సిమెంటు రేటు కంటే ఇసుక రేటు ఎక్కువగా ఉందని, జగన్ సుపరిపాలన ఇదేనని డొక్కా ఎద్దేవా చేశారు.