laughing: మీరు మనస్ఫూర్తిగా నవ్వగలుగుతున్నారా?...దాన్ని నిగ్గుతేల్చే సాఫ్ట్‌వేర్‌ వచ్చేసింది మరి!

  • నవ్వులోతుల్ని ఇది విశ్లేషిస్తుంది
  • మీ నవ్వు కృత్రిమమా, వాస్తవమా తేల్చి చెబుతుంది
  • అభివృద్ధి చేసిన లండన్‌ పరిశోధకులు

'నవ్వడం ఒక యోగం.. నవ్వించడం ఒక భోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం' అన్నారు జంధ్యాల. అవును, మనస్ఫూర్తిగా నవ్వగలగడం ఓ అదృష్టం. నవ్వుతో ఆరోగ్యానికి ఎన్నోరకాలుగా మేలు కలుగుతుంది. లాఫర్స్ క్లబ్ ల ఏర్పాటు ఉద్దేశం ఇదే.  కానీ మనం అన్ని సందర్భాల్లోనూ మనస్ఫూర్తిగా నవ్వగలమా? ఆనందంగా ఉంటేనే మనసు లోతుల్లోంచి నవ్వొస్తుంది. మనం మనస్ఫూర్తిగా నవ్వుతున్నామని అనుకున్నా అది వంద శాతం నిజమేనా?  బలవంతంగా నవ్వితే ప్రయోజనం ఉంటుందా? పని గట్టుకుని నవ్వితే లక్ష్యం నెరవేరుతుందా..? ఇంతకీ స్వచ్ఛమైన నవ్వు ఏది..? ఈ విషయాలను నిగ్గుతేల్చే సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి చేశారు లండన్‌లోని  బ్రాడ్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు.

'అడ్వాన్స్‌డ్‌ ఇంజినీరింగ్‌ ఇన్ఫర్‌మేటిక్స్‌' అనే జర్నల్‌ ప్రచురించిన కథనం ప్రకారం వీడియో రికార్డింగ్‌లో ఉన్న వ్యక్తి ముఖంలో నోరు, బుగ్గలు, కళ్ల కదలికల ఆధారంగా ఈ సాఫ్ట్‌వేర్‌ నవ్వులోని నిజాయతీని పసిగడుతుందని తేల్చారు. మనస్ఫూర్తిగా నవ్వడం, నవ్వుతున్నట్లు నటించడాన్ని ఈ సాఫ్ట్‌వేర్‌ గుర్తించగలదని వీరు చెబుతున్నారు.

కృత్రిమ, సహజ నవ్వులతో కూడిన కొందరు వ్యక్తుల చిత్రాలను పరిశోధకులు వేర్వేరుగా పరీక్షించి చూశారు. వచ్చిన ఫలితాలను విశ్లేషించగా కృత్రిమ, మనస్ఫూర్తి నవ్వుల మధ్య తేడాలు నోరు, చెంపల కదలికల్లో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. సహజ నవ్వులో కళ్ల చుట్టూ ఉండే కండరాలు 10 శాతం ఎక్కువ కదలికకు గురవుతున్నట్లు తేల్చారు.

‘భావ వ్యక్తీకరణలో నవ్వు ప్రధానమైంది. ఏదైనా ఒక విషయంపై సానుకూలంగా ఉన్నారా? లేదా? అనే విషయాన్ని నవ్వు ద్వారా పసిగట్టవచ్చు. ఈ రోజుల్లో మానవ ముఖ కవళికలు అంచనా వేయడంలో పురోగతి ఉంది. కానీ నవ్వును అంచనా వేయడం కొంత సవాల్ గానే ఉంది' అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ హాసన్‌ ఉగైల్‌ పేర్కొన్నారు. 

More Telugu News