Venugopal Rao: అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన జనసేన నేత వై.వేణుగోపాల్ రావు

  • ఎన్నికల ముందు జనసేనలో చేరిన ఆంధ్రా క్రికెటర్
  • టీమిండియాకు 16 వన్డేల్లో ప్రాతినిధ్యం
  • ప్రస్తుతం క్రికెట్ వ్యాఖ్యాతగా రాణిస్తున్న వైనం

ఇటీవలే ఎన్నికల ముందు జనసేన పార్టీలో చేరిన ఆంధ్రా క్రికెటర్ వై. వేణుగోపాల్ రావు అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. 37 ఏళ్ల వేణుగోపాల్ రావు తన కెరీర్ లో 16 వన్డేలు, 121 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. వన్డేల్లో అత్యధిక స్కోరు 61 నాటౌట్. 1998లో దేశవాళీ క్రికెట్ లో కాలుమోపిన ఈ వైజాగ్ క్రికెటర్ 2005లో టీమిండియాకు ఎంపికయ్యాడు. ఐపీఎల్ లో డెక్కన్ చార్జర్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం ఆటకు దూరంగా ఉన్న వేణు ఐపీఎల్ లో వ్యాఖ్యాతగా రాణిస్తున్నాడు. ఇటీవల వరల్డ్ కప్ మ్యాచ్ ల తెలుగు ప్రసారాల్లో కూడా తన గొంతుక వినిపించాడు.

ఇక, భారత జట్టుకు ఆడే అవకాశాలు ఏమాత్రం లేకపోవడంతో వేణు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఈ సందర్భంగా ఆంధ్రా క్రికెట్ సంఘం వేణు సేవలను కొనియాడింది. ఆంధ్రా క్రికెట్ అభివృద్ధికి ఎంతో సహకరించాడని క్రికెట్ సంఘం అధికారులు పేర్కొన్నారు. కాగా, సరిగ్గా ఎన్నికల సమయంలో జనసేన తీర్థం పుచ్చుకున్న వేణుగోపాల్ రావు ఎన్నికల్లో పోటీచేస్తాడంటూ ఊహాగానాలు వినిపించాయి. కానీ, వేణు పార్టీ వరకే పరిమితమయ్యాడు.

More Telugu News