అమ్మాయిలతో సంబంధాలు.. బేషరతు క్షమాపణలు చెప్పిన పాక్ ఓపెనర్ ఇమాముల్ హక్

30-07-2019 Tue 10:06
  • ఇమాముల్ హక్‌పై పాక్ టీవీ చానల్ సంచలన కథనం
  • తమతో జరిపిన చాటింగ్ స్క్రీన్ షాట్లను బయటపెట్టిన యువతులు
  • వార్నింగ్ ఇచ్చిన క్రికెట్ బోర్డు
పలువురు యువతులతో శారీరక సంబంధాలు పెట్టుకుని ఆపై మోసం చేశాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ స్టార్ ఓపెనర్ ఇమాముల్ హక్ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పాడు. ఇమాముల్ తన పలుకుబడిని ఉపయోగించి ఎంతోమంది యువతుల్ని మోసం చేశాడని, వారిని నమ్మించి శారీరక సంబంధాలు కూడా పెట్టుకున్నాడంటూ పాకిస్థాన్‌కే చెందిన ఓ టీవీ చానల్ ప్రసారం చేసింది. తమతో ఇమాముల్ చేసిన చాటింగ్ స్క్రీన్ షాట్లను కొందరు యువతులు బయటపెట్టారు. దీంతో పాక్ క్రికెట్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి.

తనపై ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ఇమాముల్ హక్ స్పందించాడు. పశ్చాత్తాపంతో కూడిన బేషరతు క్షమాపణలు చెప్పాడు. అమ్మాయిలతో సంబంధాలు అతడి వ్యక్తిగతమే అయినప్పటికీ తీవ్రంగా మందలించినట్టు పాక్ క్రికెట్ బోర్డు ఎండీ వాసిం ఖాన్ తెలిపారు. ఇమాముల్‌పై ఆరోపణలను బోర్డు తీవ్రంగా పరిగణించిందని, ఈ విషయాన్ని అతడి దృష్టికి తీసుకెళ్లినట్టు వాసిం తెలిపారు. అతడి వ్యక్తిగత సంబంధాలపై తాము వ్యాఖ్యానించాలనుకోవడం లేదన్న ఆయన.. పాకిస్థాన్ క్రికెట్‌కు ప్రతినిధిగా ఇమాముల్ హుందాగా వ్యవహరించాల్సి ఉంటుందని, మరోసారి ఇలాంటి పనులు చేయడని భావిస్తున్నట్టు వాసిం పేర్కొన్నారు.