సీఎం అవుతారని తెలుసు... ఎంతకాలం ఉంటారో తెలియదు: యడియూరప్పను ఉద్దేశించి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు!

29-07-2019 Mon 11:28
  • ప్రారంభమైన కర్ణాటక అసెంబ్లీ
  • విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన యడియూరప్ప
  • చురకలు అంటించిన సిద్ధరామయ్య
ఈ ఉదయం కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వేళ జరిగిన చర్చలో పాల్గొన్న మాజీ సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని నడిపించేందుకు అందరినీ కలుపుకు పోతానని యడియూరప్ప చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానని అంటూనే చురకలు వేశారు. ఎప్పుడైతే ఎమ్మెల్యేలు ముంబైలోని హోటల్ కు చేరిపోయారో, అప్పుడే తనకు యడియూరప్ప సీఎం అవుతారన్న సంగతి తెలిసిపోయిందని అన్నారు. అయితే, ఆయన ముఖ్యమంత్రి పీఠంపై ఎంతకాలం ఉంటారో తనతో పాటు ఆయనకు కూడా తెలియదని సెటైర్ వేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రతి ఒక్కరితో చర్చలు జరపాలని సూచించారు. ముఖ్యంగా సామాన్యుల సమస్యలను దృష్టిలో ఉంచుకోవాలని, నీటి సమస్య పరిష్కారానికి శ్రద్ధ చూపాలని కోరారు. రైతు సమస్యలు పరిష్కరిస్తానని చెప్పిన యడియూరప్పను తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని, వారి పొలాలకు సాగునీటిని తెప్పిస్తే చాలని అన్నారు.