Sudhir Makkar: 16 కేజీల బంగారం ధరించి 26వ కన్వర్ యాత్రకు హాజరైన ‘బంగారు బాబా’

  • ఈసారి నాలుగు కిలోల ఆభరణాలను తగ్గించిన బాబా
  • 25 ఏళ్లుగా కన్వర్ యాత్ర
  • ఆభరణాలన్నీ తన సొంత డబ్బుతోనే కొన్నానన్న సుధీర్ మక్కర్
‘గోల్డెన్ బాబా’గా చిరపరిచితమైన సుధీర్ మక్కర్ మరోమారు వార్తల్లోకి ఎక్కారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరుగుతున్న 26వ కన్వర్ యాత్రకు 16 కిలోల బంగారు ఆభరణాలు ధరించి హాజరయ్యారు. నిజానికి ఆయన 20 కిలోల ఆభరణాలు ధరిస్తారు. అయితే, ఆరోగ్య కారణాల వల్ల ఈసారి నాలుగు కిలోలు తగ్గించారు. ఈ నెల 21న ఢిల్లీలో కన్వర్ యాత్రను ప్రారంభించినట్టు గోల్డెన్ బాబా తెలిపారు. గత 25 ఏళ్లుగా కన్వర్ యాత్రలో తాము పాల్గొంటున్నట్టు చెప్పారు.  

మొదట్లో తాను 2, 3 గ్రాముల బంగారాన్ని మాత్రమే ధరించేవాడినని, కానీ ఈ రోజు కిలోల కొద్దీ ఆభరణాలను ధరిస్తున్నట్టు తెలిపారు. తనకు ఆభరణాలు ఇవ్వాలని ఎవరినీ అడగలేదని, తన సొంత డబ్బులతోనే వీటిని కొనుగోలు చేసినట్టు తెలిపారు. బాబా ధరించిన వాటిలో చైన్లు, లాకెట్లు, బ్రాస్‌లెట్లు, ఉంగరాలు తదితర ఆభరణాలు ఉన్నాయి. బాబా చుట్టూ ఎప్పుడూ 250-300 మంది ఉంటారు. వారికి ఆహారం, నీళ్లు వంటి సౌకర్యాలను బాబా స్వయంగా కల్పిస్తారు. అంతేకాదు, కన్వర్ యాత్రలో వారి వెంట ఎప్పుడూ ఓ అంబులెన్స్ కూడా ఉంటుంది.
Sudhir Makkar
Golden Baba
Kanwar Yatra

More Telugu News