Hyderabad: హైదరాబాద్ మెట్రో రైలుపై వస్తున్న వార్తలు అవాస్తవం: ‘మెట్రో’ ఎండీ

  • వేరే ట్రాక్ పై మెట్రో సర్వీస్ వెళ్లిందన్న వార్తలు అబద్ధం 
  • వాస్తవాలు తెలుసుకోకుండా వదంతులు సృష్టించారు
  • ఈ మధ్యాహ్నం బలమైన గాలులు వీచాయి
  • ట్రాక్ కు అడ్డంగా ఓ రాడ్ పడింది

ఎల్బీనగర్- మియాపూర్ స్టేషన్ల మధ్య నడిచే మెట్రో రైలు ప్రయాణించాల్సిన ట్రాక్ పై కాకుండా వేరే ట్రాక్ పై వెళ్లిందంటూ వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలను మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఖండించారు. ఈ వార్తలు అవాస్తవమని, వాస్తవాలు తెలియకుండా వదంతులు వ్యాప్తి చేయొద్దని కోరారు.

శనివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో బలమైన గాలుల ధాటికి ట్రాక్ కు అడ్డంగా ఓ రాడ్ పడిపోయిందని, దీంతో, ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వైపు వెళ్తున్న రైలు అసెంబ్లీ స్టేషన్ దాటి లక్డీకాపూల్ వద్దకు రాగానే నిలిపివేసినట్టు చెప్పారు. దీంతో, ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపి వేశారని, బ్యాటరీ సాయంతో రైలును వెనక్కి తీసుకెళ్లి అసెంబ్లీ స్టేషన్ వద్ద నిలిపినట్టు వివరించారు.

లక్డీకాపూల్ స్టేషన్ కు ముందు రైలు ఆగిన సమయంలో, అందులో ఓ ఆస్తమా పేషెంట్ ఉన్నారని, అత్యవసర పరిస్థితుల్లో ఈ రైలును వెనక్కి పంపాల్సి వచ్చిందని వివరించారు. ఆ తర్వాత ట్రాక్ పై పడ్డ రాడ్ ను తొలగించామని, మెట్రో సేవలను యథాతథంగా కొనసాగించామని చెప్పారు. ఈ ఘటనతో సుమారు అర్ధగంట సమయం రైలు సేవలకు అంతరాయం కలిగిందని అన్నారు.

ఎల్బీ నగర్- మియాపూర్ మెట్రో సర్వీస్ రైలు ఆగినప్పటి నుంచి అదే ట్రాక్ పై వెనుక నుంచి వచ్చే రైలు సిబ్బందితో సమన్వయం చేశామని, దాన్ని ముందుగానే నిలిపివేశామని చెప్పారు.

More Telugu News