Andhra Pradesh: టీడీపీ నేత రామసుబ్బారెడ్డికి ఊరట.. ‘షాద్ నగర్’ జంట హత్యల కేసును కొట్టివేసిన సుప్రీంకోర్టు!

  • 1990లో షాద్ నగర్ లో జంట హత్యలు
  • 23 నెలలు జైలులో ఉన్న రామసుబ్బారెడ్డి
  • సుప్రీం తీర్పుపై రామసుబ్బారెడ్డి వర్గీయుల హర్షం

టీడీపీ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గత 28 ఏళ్లుగా నడుస్తున్న షాద్ నగర్ జంట హత్యల కేసులో హైకోర్టు తీర్పును సమర్థిస్తూ, మళ్లీ విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో హైకోర్టులో ఇప్పటికే అనుకూలంగా తీర్పు పొందిన రామసుబ్బారెడ్డి ఊపిరి పీల్చుకున్నారు. 1990 డిసెంబర్ 6న షాద్ నగర్ వద్ద శివ శంకర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు మాజీ మంత్రులు పొన్నపురెడ్డి శివారెడ్డి, రామసుబ్బారెడ్డి సహా మొత్తం 11 మందిపై కేసు నమోదైంది.

కేసు విచారణ సాగుతుండగానే.. పొన్నపురెడ్డి శివారెడ్డి హత్యకు గురయ్యారు. 2004లో రామసుబ్బారెడ్డిని కోర్టు దోషిగా తేల్చింది. దీంతో రామసుబ్బారెడ్డి 23 నెలల కారాగార శిక్షను అనుభవించారు. అనంతరం హైకోర్టులో ఈ తీర్పును సవాలు చేయగా,  రామసుబ్బారెడ్డిని న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మృతుల కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ కేసులో విచారణ కొనసాగించాలంటూ తెలంగాణ ప్రభుత్వం కూడా అత్యున్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసింది. కానీ చివరికి ఈ కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

More Telugu News