Virat Kohli: కోహ్లీ అధికారాలకు బీసీసీఐ కత్తెర!

  • కోచ్ ఎంపికలో కోహ్లీ పాత్ర ఉండదన్న బీసీసీఐ అధికారి
  • కపిల్ దేవ్ కమిటీనే కోచ్ ఎంపిక చేస్తుందంటూ వెల్లడి
  • కోహ్లీ అభిప్రాయాలను కపిల్ దేవ్ కమిటీ పట్టించుకోకపోవచ్చన్న అధికారి

ఇకమీదట విరాట్ కోహ్లీకి టీమిండియా కోచ్ ఎంపికలో ఎలాంటి పాత్ర ఉండదని బీసీసీఐ వర్గాలంటున్నాయి. కపిల్ దేవ్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ మాత్రమే భారత జట్టు కోచ్ ను ఎంపిక చేస్తుందని, ఇందులో కోహ్లీ సహా ఎవరి ప్రమేయం ఉండదని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. కపిల్ దేవ్ కమిటీ ఎంపిక చేసిన కొత్త కోచ్ పై కోహ్లీ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేడని సదరు అధికారి స్పష్టం చేశారు. కోహ్లీ ఇష్టాయిష్టాలతో కపిల్ దేవ్ కమిటీకి పనిలేదని వెల్లడించారు.

గతంలో అనిల్ కుంబ్లే టీమిండియా కోచ్ గా పనిచేసిన కాలంలో కోహ్లీ అనేక అభ్యంతరాలు వెలిబుచ్చాడు. కుంబ్లే వద్దంటూ రవిశాస్త్రికి ఓటేశాడు. ఈసారి మాత్రం బీసీసీఐ కెప్టెన్ గా కోహ్లీ అధికారాలను పరిమితం చేసినట్టు కనిపిస్తోంది. ఈసారి కోహ్లీ అభిప్రాయాలను కోచ్ ఎంపిక కమిటీ పట్టించుకోకపోవచ్చని, టీమిండియా కోచ్ కు అసిస్టెంట్లను కూడా ఈ కమిటీనే ఎంపిక చేస్తుందని తెలిపారు.

More Telugu News