Erramanjil: పురాతన భవనాలను ఏ ప్రాతిపదికన కూలుస్తారు?: ఎర్రమంజిల్ భవనాల కూల్చివేత కేసులో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

  • నిపుణుల సలహాతోనే కొత్త భవనాల నిర్మాణమన్న ఏజీ
  • చారిత్రక జాబితా నుంచి ప్రభుత్వం తొలగించిందని వెల్లడి
  • ఏ ప్రాతిపదికన కూలుస్తారని ప్రశ్నించిన హైకోర్టు

ఎర్రమంజిల్‌లో నూతన అసెంబ్లీ నిర్మాణం కోసం అక్కడున్న పాత భవనాలను కూల్చివేసే అంశంపై హైకోర్టులో వాదోపవాదనలు నడుస్తున్న విషయం తెలిసిందే. నిన్న పిటిషనర్ తరుపు వాదనలు విన్న హైకోర్టు నేడు ప్రభుత్వం తరుపు వాదనలు విన్నది. ప్రభుత్వం తరుపున అడిషనల్ అడ్వకేట్‌ జనరల్‌ రామచంద్రరావు వాదనలు వినిపించారు. అవన్నీ ప్రభుత్వ పాలసీ విధానాలని, వాటిని ప్రశ్నించే హక్కు పిటిషనర్లకు లేదని ఏజీ వాదించారు. ప్రభుత్వం కూల్చివేతలపై చట్టబద్దంగానే నిర్ణయాలు తీసుకుందని, భద్రతా పరంగానూ అన్ని కోణాల్లో పరిశీలించిన మీదటే నిపుణుల సలహాతో కొత్త భవనాల నిర్మాణం చేపడుతోందని ఏజీ పేర్కొన్నారు.

ఎర్రమంజిల్‌లోని భవనాలు చారిత్రక కట్టడాలు కావని, వాటిని చారిత్రక జాబితా నుంచి ప్రభుత్వం తొలగించిందన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు పురాతన భవనాలను ఏ ప్రాతిపదిక ప్రకారం కూలుస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒకసారి పరిరక్షణ కట్టడాల పరిధిలోకి వచ్చాక వాటిని ఆ జాబితా నుంచి ఎలా తొలగిస్తారు? వాటిని పరిరక్షించాలని నిబంధనలు చెబుతున్నాయి కదా? అని వ్యాఖ్యానించింది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని నిబంధనల ప్రకారమే ప్రభుత్వం కూడా నడుచుకోవాలని సూచించింది. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

More Telugu News