Lok Sabha: అత్యంత కీలకమైన ఎన్ఐఏ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన నాలుగు పార్టీలు!

  • నిన్న లోక్ సభ ముందుకు వచ్చిన ఎన్ఐఏ సవరణ బిల్లు
  • అనుకూలంగా ఓటు వేసిన 278 మంది ఎంపీలు
  • వ్యతిరేకించిన ఆరుగురు సభ్యులు

ఎన్ఐఏ చట్ట సవరణ బిల్లుపై లోక్ సభలో నిన్న ఓటింగ్ జరిగింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా నాలుగు పార్టీలకు చెందిన ఆరుగురు ఎంపీలు ఓటు వేశారు. ఎంఐఎం, నేషనల్ కాన్ఫరెన్స్, సీపీఐ, సీపీఎంలు బిల్లును వ్యతిరేకించాయి. బిల్లును వ్యతిరేకించిన ఎంపీలలో ఎంఐఎంకు చెందిన అసదుద్దీన్ ఒవైసీ, సయ్యద్ ఇంతియాజ్ జలీల్, నేషనల్ కాన్ఫరెన్స్ కు చెందిన హస్నైన్ మసూది, సీపీఐకి చెందిన కె.సుబ్బరాయన్, సీపీఎంకు చెందిన మజీద్ ఆరిఫ్, నటరాజన్ ఉన్నారు.

బిల్లుపై చర్చ జరిగిన అనంతరం ఓటింగ్ ప్రక్రియను డివిజన్ ద్వారా నిర్వహించాలని ఒవైసీ కోరారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా డివిజన్ ద్వారానే జరిగితే బాగుంటుందని చెప్పారు. డివిజన్ జరిగితేనే ఎవరు ఉగ్రవాదానికి అనుకూలంగా ఉన్నారు, ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు అనే విషయం దేశ ప్రజలకు అర్థమవుతుందని తెలిపారు.

ఉగ్రవాదంతో సంబంధం ఉన్న కేసులను ఎన్ఐఏ విచారిస్తుందనే విషయం తెలిసిందే. తాజాగా ఎన్ఐఏ చట్టానికి సవరణలు తీసుకురావాలని భావించిన కేంద్రం... ఎన్ఐఏకి మరిన్ని అధికారాలు కట్టబెట్టేలా సవరణలు చేసింది. సరవణ బిల్లు ద్వారా భారత్ వెలుపల కూడా విచారణ జరిపే అధికారాలను ఎన్ఐఏకు దక్కుతాయి.

మరోవైపు, ఎన్ఐఏ సవరణ బిల్లు లోక్ సభలో పాస్ అయింది. 278 మంది ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. ఆరుగురు సభ్యులు మాత్రం వ్యతిరేకించారు.

More Telugu News