Andhra Pradesh: ఏపీలో గత ప్రభుత్వం ఇంత ఎక్కువ ధరకు ఎందుకు ఒప్పందం చేసుకుంది?: అజయ్ కల్లాం

  • సర్వే ప్రకారం పవన, సౌర విద్యుత్ ధరలు తగ్గాయి
  • పవన విద్యుత్ యూనిట్ రూ.4.84కు ఒప్పందం చేసుకున్నారు!
  • పలుచోట్ల ఇంత కంటే తక్కువ ధరకే లభ్యమవుతోంది

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో పవన విద్యుత్ యూనిట్ రూ.4.84కు ఒప్పందం చేసుకున్నారని, పలుచోట్ల దీని కంటే తక్కువ ధరకే లభ్యమవుతున్నప్పుడు ఇంత ఎక్కువ ధర ఎందుకు పెట్టాల్సి వచ్చిందని ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం ప్రశ్నించారు.

సచివాలయంలోని ప్రచార విభాగంలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి ముందు రోజున 2018-19 ఆర్థిక సర్వేను కేంద్రం ప్రవేశపెట్టిందని అన్నారు. ఈ సర్వే ప్రకారం దేశ వ్యాప్తంగా పవన, సౌర విద్యుత్ ధరలు గణనీయంగా తగ్గాయని అన్నారు. ఎక్కువ ధర చెల్లించి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం రాష్ట్రాలకు లేదని అన్నారు.

2010 సంవత్సరంలో రూ.18 గా ఉన్న సౌర విద్యుత్ యూనిట్ ధర 2018 నాటికి రూ.2.44 పైసలకు పడిపోయిందని, 2017 డిసెంబర్ నాటికే పవన్ విద్యుత్ ధర సగటున రూ.4.20 పైసల నుండి రూ.2.43 పైసలకు పడిపోయినట్టు వివరించారు. ఈ సందర్భంగా పీపీఏలను రూ.6కు గత ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. పీపీఏల వల్ల ఏటా రూ.2,500 కోట్ల ప్రజాధనం అదనంగా ఖర్చయిందని, టెండర్లు నిర్వహించకుండా ఒప్పందాలు కుదుర్చుకోవడం సరికాదని అన్నారు.

పీపీఏలు లేకుండానే యూనిట్ రూ.2.72 పైసలకు అందిస్తామని పలు కంపెనీలు ముందుకొస్తున్నా, గత ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో తెలియడం లేదని, పీపీఏల రద్దుతో పెట్టుబడులు రావన్నది తప్పుడు ప్రచారమేనని అన్నారు. ఎప్పుడైనా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పారదర్శకంగా ఉండాలని, అందులో భాగంగానే పారదర్శక ఒప్పందాల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో సరిపడినంత విద్యుత్ ఉత్పత్తి ఉందని, అధిక ధరలకు ఒప్పందాల వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని అజయ్ కల్లాం అన్నారు.

More Telugu News