Vijayawada: విజయవాడలోని రోడ్లపై వర్షపు నీరు నిలవకుండా చర్యలు చేపట్టండి: మంత్రి వెల్లంపల్లి ఆదేశాలు

  • విజయవాడలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి
  • మంత్రి వెంట నగరపాలక సంస్థ అధికారులు
  • సమస్యల పరిష్కారానికి తగు ప్రణాళికలు, అంచనాలు తయారు చేయాలి

విజయవాడ నగరంలోని రోడ్లపై వర్షపు నీరు నిలవకుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టే నిమిత్తం ప్రణాళికలు, అంచనాలు తయారు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేశను ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. ఈరోజు ఉదయం నగరపాలక సంస్థ అధికారులతో కలిసి ఆర్ ఆర్ అప్పారావు వీధి, వినుకొండ వారి వీధి, సుబ్బరామయ్య వీధి,  గీతా మందిరం, కాళేశ్వరం మార్కెట్ తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.
 
ఆర్ అప్పారావు వీధిలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ పనులను, చిన్నపాటి వర్షాలకే జలమయమైన గణపతి రోడ్డును పరిశీలించారు. నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద ప్రతిరోజు డ్రైన్లు పొంగి రోడ్డుపైకి మురుగు, వర్షపు నీరు చేరుతోందని, దీంతో ఈ ప్రాంత ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని స్థానికులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సమస్యలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న వెల్లంపల్లి శ్రీనివాస్, ఆయా ప్రాంతాల్లోని సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు అవసరమైన ప్రణాళికలు, అంచనాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

More Telugu News