Tamilnadu: సినిమా ప్రచారం కోసం చావు పోస్టర్ వేసుకున్న నటుడు... వారం రోజుల్లో అదే నిజమైంది!

  • తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఘటన
  • టెంట్ హౌస్ యజమానికి వచ్చిన సినిమా విలన్ చాన్స్
  • విలన్ చనిపోయే సీన్ కోసం శ్రద్ధాంజలి పోస్టర్లు
  • వారం తిరిగే సరికి మృతి

తాను నటించిన ఓ సినిమా ప్రమోషన్ నిమిత్తం, చనిపోయినట్టుగా శ్రద్ధాంజలి పోస్టర్ వేయించుకున్నాడో తమిళ నటుడు. ఆ పోస్టర్లను చూసిన స్నేహితులు, మిత్రులు హుటాహుటిన అతని ఇంటికి తరలివచ్చి అవాక్కయ్యారు. సరిగ్గా వారం రోజుల తరువాత అదే తరహా పోస్టర్లు మళ్లీ వెలిశాయి. ఇంకోసారి తమ మిత్రుడు కామెడీ చేస్తున్నాడులే అనుకున్నారంతా. కానీ జరిగింది మాత్రం వేరు. ఈ సారి ఆయన నిజంగానే చనిపోయాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

వివరాల్లోకి వెళితే, తూత్తుకూడి జిల్లా కాయల్‌పట్టినంకు చెందిన ఆర్‌ఎస్‌ గోపాల్‌ (52) టెంట్ హౌస్ ను నిర్వహిస్తూ, "గరిట నుంచి గజరాజు వరకు అన్నీ దొరకును" అన్న ప్రచారాన్ని ప్రారంభించాడు. ఈ ప్రచారం వినూత్నంగా ఉండటంతో, సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఈ క్రమంలో ఈ మధ్య గోపాల్, ఓ సినిమాలో విలన్ గా నటించాడు.

ఆ సినిమాలో అతను చనిపోయే సీన్ ఉండటంతో, వీధుల్లో 'శ్రద్ధాంజలి' పోస్టర్లు వేసి, కొన్ని సీన్స్ షూట్ చేశారు. గోపాల్ సరదాగా, వీటిని తన సోషల్ మీడియా ద్వారా బంధుమిత్రులకు పంపాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన వారు, పూలదండలు తీసుకుని, అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చేసరికి, ఇంట్లో గోపాల్‌ చిరునవ్వులు చిందిస్తూ కనిపించాడు. విషయాన్ని వారికి వివరించి, ఆ పోస్టర్లను చింపివేస్తూ, ఫొటోలకు పోజులిచ్చాడు కూడా. ఈ ఘటన వారం క్రితం జరిగింది.

తిరిగి శనివారం నాడు ఇదే తరహా పోస్టర్లు కనిపించాయి. ఇది కూడా సినిమా ప్రమోషన్ అని పలువురు భావించారు. కొందరికి అనుమానం వచ్చి ఫోన్ చేయగా, అనారోగ్య కారణాలతో గోపాల్‌ మృతి చెందినట్లు తెలిసింది. దీంతో అవాక్కైన వారు, అశ్రునయనాలతో అంత్యక్రియల్లో పాల్గొనాల్సి వచ్చింది. తన చావు పోస్టర్లను తానే ప్రచారం చేసుకున్న గోపాల్, నిజంగానే మరణించిన ఘటనపై ఈ ప్రాంతంలో పెద్ద చర్చే జరిగింది.

More Telugu News