చంద్రయాన్-2 నిలిచిన కారణమిదే!

15-07-2019 Mon 08:47
  • క్రయోజనిక్ స్టేజ్ లో లోపాలు
  • పూర్తిగా చార్జింగ్ కాని బ్యాటరీలు
  • మళ్లీ ప్రయోగం వారాల్లోనా? నెలల్లోనా చెప్పలేమంటున్న శాస్త్రవేత్తలు

"సాంకేతిక కారణాల వల్ల చంద్రయాన్-2 ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నాం. మరో తేదీని తిరిగి ప్రకటిస్తాం"... ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఇస్రో తన ట్విట్టర్ ఖాతాలో చేసిన ప్రకటన ఇది. అంతకు ఐదు నిమిషాల ముందే ప్రయోగం ప్రత్యక్ష ప్రసారం ఆగిపోయింది. ఈ ప్రయోగాన్ని వీక్షించాలని అంత రాత్రిలోనూ టీవీలకు అతుక్కుపోయి వేచిచూస్తున్న ఔత్సాహికులు, కాబోయే శాస్త్రవేత్తలు, సైన్స్ విద్యార్థులు లైవ్ ఆగిపోవడంతో ఏం జరిగిందో అన్న ఆత్రుతలో ఉండగానే, ఇస్రో ప్రకటన వెలువడింది.

ఇక ఆ సాంకేతిక సమస్య ఏంటి? అన్న విషయాన్ని పరిశీలిస్తే, రాకెట్ లోని క్రయోజనిక్ స్టేజ్ ఈ ప్రయోగంలో అత్యంత కీలకమైనదన్న సంగతి తెలిసిందే. ఈ క్రయోజనిక్ ఇంధనం అత్యంత కచ్చితత్వంతో వెలువడుతూ, పూర్తి గ్రౌండ్ కంట్రోల్ లో ఉండాలి. కావాల్సినప్పుడు ఇంధనాన్ని మండిస్తూ, అవసరం లేని సమయంలో తక్కువ ఇంధనాన్ని వదులుతూ ఉండాలి.

ప్రయోగానికి గంటకు ముందు లిక్విడ్ హైడ్రోజన్ ఇంధనాన్ని నింపినట్టు కూడా ఇస్రో ప్రకటించింది. ఆపై నిమిషాల వ్యవధిలోనే ఇంధనం నింపే సమయంలో, కొంత వాక్యూమ్ ఏర్పడిందని, ట్యాంకులో పూర్తి స్థాయిలో ఇంధనం నిండలేదని, ఇదే సమయంలో బ్యాటరీలు పూర్తి స్థాయిలో చార్జింగ్ లో లేవని కంప్యూటర్లు చూపిస్తుండటంతో, రిస్క్ తీసుకోలేకనే ఇస్రో ఈ ప్రయోగాన్ని వాయిదా వేయాలని చివరి నిమిషాల్లో నిర్ణయించుకుంది.
 
ఇక ఏ ఒక్క చిన్న సాంకేతిక సమస్యనూ తేలికగా తీసుకునే అవకాశం లేని ప్రయోగం ఇదని, అన్నీ 100 శాతం కచ్చితంగా ఉంటేనే ప్రయోగాన్ని నిర్వహిస్తామని ఇస్రో ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతానికి చంద్రయాన్-2 వాయిదా సరైన నిర్ణయమేనని ఆయన అన్నారు. ఇక తిరిగి ప్రయోగం చేపట్టేందుకు వారాలు పడుతుందా? లేక నెలలు పడుతుందా? అన్న విషయాన్ని చెప్పలేమని అన్నారు.