IPL: ఈసారి మరింత కళకళలాడనున్న ఐపీఎల్... 10 జట్లతో పోటీలు!

  • గత సీజన్ లో 8 జట్లతో పోటీలు నిర్వహణ
  • కొత్తగా మరో రెండు జట్లకు స్థానం కల్పించే అవకాశం
  • విధివిధానాల రూపకల్పనలో ఐపీఎల్ వర్గాలు!

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వచ్చే సీజన్ లో 10 జట్లు పోటీపడనున్నట్టు తెలుస్తోంది. గత సీజన్ లో 8 జట్లతోనే పోటీలు నిర్వహించారు. కొన్నాళ్ల క్రితం చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలపై అవినీతి ఆరోపణలు రావడంతో వాటిపై నిషేధం విధించి వాటిస్థానంలో కొత్తగా రెండు ఫ్రాంచైజీలకు అవకాశమిచ్చారు. నిషేధం తొలగి చెన్నై, రాజస్థాన్ జట్లు పునరాగమనం చేయడంతో ఈ కొత్త ఫ్రాంచైజీల కథ అంతటితో ముగిసింది. మళ్లీ ఇప్పుడు మరో రెండు కొత్త జట్లకు అవకాశం ఇవ్వాలని ఐపీఎల్ నిర్వాహకులు తలపోస్తున్నట్టు సమాచారం.

ఐపీఎల్ విస్తరణ ఖాయం అని, విధివిధానాల రూపకల్పన జరుగుతోందని ఐపీఎల్ వర్గాలంటున్నాయి. ఐపీఎల్ లో కొత్త ఫ్రాంచైజీల ఏర్పాటు కోసం అదాని గ్రూప్, ఆర్పీజీ సంజీవ్ గోయెంకా గ్రూప్, టాటా గ్రూప్ తో పాటు మరికొన్ని ఇతర కార్పొరేట్ సంస్థలు కూడా ఉవ్విళ్లూరుతున్నాయి. దీనిపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది.

More Telugu News