Nara Lokesh: మూర్ఖత్వం అనేది పుట్టుకతో రావాల్సిందే, మధ్యలో సంపాదించడం అసాధ్యం... జగన్ గారిని చూశాక నిజమని తేలింది: నారా లోకేశ్

  • జగన్ పై లోకేశ్ సెటైర్
  • వెకిలి వేషాలు వద్దంటూ ట్వీట్
  • ప్రజల సమస్యలపై దృష్టిపెట్టాలంటూ హితవు

టీడీపీ యువనేత, ఏపీ మాజీ మంత్రి నారా లోకేశ్ మరోసారి తన ట్వీట్లకు పని చెప్పారు. ఎప్పట్లాగానే సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ సెటైర్ విసిరారు. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, మూర్ఖత్వం అనేది జన్మతః రావాల్సిందే తప్ప దాన్ని మధ్యలో ప్రత్యేకంగా సంపాదించడం కుదరదన్న విషయాన్ని జగన్ గారిని చూశాక తెలిసిందని వ్యంగ్యం ప్రదర్శించారు. పీపీఏల్లో అవినీతి జరిగిందని ఎలుగెత్తుతున్న వైసీపీ నేతలు లేని అవినీతిని ఎక్కడ నుంచి వెలికి తీస్తారు? అంటూ ట్వీట్ చేశారు.

విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి పీపీఏలు సక్రమంగానే ఉన్నాయి, మీ నిర్ణయాలతో విద్యుత్ రంగంలో దేశవ్యాప్తంగా పెట్టుబడులు వెనక్కి వెళతాయి అని కేంద్రం ఎన్ని లేఖలు రాసినా జగన్ మొండిగా వ్యవహరిస్తున్నారంటూ లోకేశ్ మండిపడ్డారు. జగన్ వైఖరి చూస్తుంటే తాను పట్టిన కుందేటికి అసలు కాళ్లే లేవు అన్న చందంగా ఉందని విమర్శించారు. జగన్ గారూ, ఇలాంటి వెకిలి వేషాలు వద్దు, ప్రజల సమస్యల పట్ల ఆలోచించండి అంటూ హితవు పలికారు.

More Telugu News