Karnataka: నేను పారిపోయానని సుప్రీం కోర్టులో చెప్పారు... రెబెల్ ఎమ్మెల్యేలపై కర్ణాటక స్పీకర్ ఫైర్

  • ఇంకా ఓ కొలిక్కిరాని కర్ణాటక సంక్షోభం
  • స్పీకర్ రమేశ్ కుమార్ విసుర్లు
  • ఎమ్మెల్యేలను ఏకిపారేసిన స్పీకర్

కర్ణాటకలో ఏర్పడిన రాజకీయ సంక్షోభంలో రాజ్యాంగ విలువలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నానని అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ చెబుతున్నారు. ఓ తెలుగు మీడియా చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన కాస్తంత ఆవేశంగా, మరికాస్త ఆవేదనభరితంగా తన అభిప్రాయాలు వెల్లడించారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేసినంత మాత్రాన గుడ్డిగా ఆమోదించాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు.

రాజీనామా చేసినట్టుగా చెబుతున్న ఎమ్మెల్యేలు తనకు చెప్పకుండానే తన కార్యాలయానికి వచ్చారని వివరించారు. అయితే ఆ సమయంలో తాను అక్కడ లేకపోవడంతో లేఖలు ఇచ్చి వెళ్లిపోయారని తెలిపారు. తాను ఆఫీసుకు వచ్చి వాళ్ల లేఖలు పరిశీలించి ఫార్మాట్ లో లేవన్న విషయాన్ని వాళ్లకు ప్రత్యుత్తరం ద్వారా తెలియపర్చానని వివరించారు.

"ఇప్పటికీ మీకు రాజీనామా చేయాలన్న ఉద్దేశం బలంగా ఉంటే, సరైన ఫార్మాట్ లో లేఖలు ఇవ్వండి అని చెప్పాను. అంతేగాకుండా, వాళ్లను నా కార్యాలయానికి రావాల్సిందిగా కోరాను. రాజీనామాకు వాళ్లు చెప్పే కారణాలకు నేను కన్విన్స్ కావాలి కదా! కానీ ఈ మధ్యలో వీళ్లేంచేశారంటే, స్పెషల్ ఫ్లయిట్ లో ముంబయి వెళ్లిపోయారు. అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇష్టానుసారం మాట్లాడారు. ఆపై ఢిల్లీ వెళ్లి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో నాపై వ్యాఖ్యలు చేశారు. మేము వస్తున్నామని తెలిసి స్పీకర్ గారు పారిపోయారు అంటూ అఫిడవిట్ లో పేర్కొన్నారు. మైనారిటీలో పడిపోయిన ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఆయన అలా చేశారు అంటూ నాపై సుప్రీంకోర్టుకు చెప్పారు" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా న్యూస్ చానల్ యాంకర్ ప్రశ్నిస్తూ, సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసమే రాజీనామాల ఆమోదాన్ని జాప్యం చేస్తున్నారని జాతీయస్థాయిలో అనుమానాలు కలుగుతున్నాయని అడిగారు. దీనికి రమేశ్ కుమార్ తల అడ్డంగా ఊపుతూ బదులిచ్చారు.  

"ఒక శాసనసభ్యుడు ముంబైకి ప్రత్యేక విమానంలో వెళ్లి అక్కడ స్పెషల్ ప్రొటెక్షన్ తీసుకుని నా వద్దకు వచ్చి లేఖ ఇస్తే అది సహజరీతిలో జరిగే రాజీనామా అని నేను ఒప్పుకోవాలా? వాళ్లు చెప్పినట్టు నేను ఆడాలా! చట్టంతో పనిలేదా? ఆ ఎమ్మెల్యేలను నేనేమైనా రావొద్దన్నానా? అబద్ధాలు బొంకారు, అఫిడవిట్ అంటారు. స్పీకర్ అనుమతి కోరలేదని మళ్లీ వాళ్లే చెబుతారు. మేం వెళితే స్పీకర్ పారిపోయాడని కూడా అంటారు. వాళ్లిష్ట ప్రకారం వస్తే నేను వాళ్ల కోసం ద్వారపాలకుడిలా కాచుకుని ఉండాలా! వీళ్ల నియోజకవర్గాలు ఎక్కడ? వీళ్లు దాక్కున్నది ఎక్కడ? వీళ్లకు ముంబయిలో ఏంపని? నాకు పార్టీలతో పనిలేదు. ఒక్కసారి స్పీకర్ చైర్లో కూర్చుంటే నాకు అందరూ సమానమే. నేను రాజ్యాంగానికి ప్రతినిధిని" అంటూ వ్యాఖ్యానించారు.

More Telugu News