MS Dhoni: విండీస్ పర్యటనకు వచ్చేవారం టీమిండియా ఎంపిక... ధోనీ ఎంపికపై సెలెక్టర్ల సందిగ్ధం!

  • త్వరలో భారత జట్టు కరీబియన్ పర్యటన
  • ఈ నెల 17 లేదా 18న జట్టు ఎంపిక
  • ధోనీ విండీస్ వెళ్లబోవడం లేదంటున్న సన్నిహితులు!

భారత క్రికెట్ రంగంలో ఎంఎస్ ధోనీ ఓ దిగ్గజం. ధోనీ సాధించిన విజయాలు, ఘనతలు దేశ కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింపచేశాయి. కానీ, ఇప్పుడు ధోనీ ఆడుతున్న విధానం చూస్తుంటే ఇంకెంతకాలమో జట్టులో కొనసాగుతాడనిపించడంలేదు. వరల్డ్ కప్ సెమీస్ లో న్యూజిలాండ్ పై ధోనీ బ్యాటింగ్ దాదాపు అసంతృప్తికరంగానే సాగింది. ఇక అసలు విషయానికొస్తే, త్వరలోనే భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళుతోంది. ఈ టూర్ కు వెళ్లే టీమిండియా ఎంపిక కోసం భారత సెలక్టర్లు ఈ నెల 17న గానీ, 18న గానీ ముంబయిలో సమావేశం కానున్నారు.

ఇప్పటికే రెస్ట్ లేకుండా ఆడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి కొద్దిమంది క్రికెటర్లను ఈ పర్యటనకు ఎంపిక చేయకుండా విశ్రాంతి ఇవ్వనున్నారు. అయితే ధోనీ విషయమే సెలక్టర్లను సందిగ్ధంలో పడేస్తోంది. వరల్డ్ కప్ ప్రదర్శన నేపథ్యంలో రిటైర్మెంట్ ఇస్తాడన్న ప్రచారం నేపథ్యంలో, ఈ మాజీ సారథి నుంచి వచ్చే కబురు కోసం సెలక్టర్లు వేచి చూస్తున్నారు. తాను ఇక క్రికెట్ నుంచి తప్పుకుంటన్నట్టు ధోనీ ప్రకటిస్తే సరి, లేకపోతే అతడ్ని కరీబియన్ టూర్ కు ఎంపిక చేయాలా? లేక పక్కనబెట్టాలా? అన్నది సెలక్టర్లకు తలనొప్పిగా మారుతుంది.

ధోనీకి పంత్ రూపంలో వారసుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవడం ధోనీకే వదిలేయడం మేలని మాజీ క్రికెటర్లు అంటున్నారు. గతంలో టెస్టు క్రికెట్ నుంచి ధోనీ తప్పుకోవడానికి ముందు ఎమ్మెస్కే ప్రసాద్ చర్చలు జరిపాడు. ఇప్పుడు కూడా ఎమ్మెస్కే చొరవ తీసుకుని ధోనీతో మాట్లాడి, అతని మనసులో ఏముందో కనుక్కోవాలని మాజీలు సూచిస్తున్నారు. ఇక, ధోనీ సన్నిహితులు చెబుతున్నదాన్ని బట్టి చూస్తే, వెస్టిండీస్ పర్యటనకు ధోనీ వెళ్లట్లేదని సమాచారం. ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడన్న ఊహాగానాలకు ఇది కచ్చితంగా బలం చేకూర్చే అంశమే. ఏదేమైనా మరికొన్ని రోజుల్లో ధోనీ కెరీర్ పై స్పష్టత రానుంది.

More Telugu News