Congress: అధ్యక్ష బాధ్యతలు తన వల్ల కాదంటున్న సోనియా!

  • వరుస సంక్షోభాల్లో పార్టీ
  • తాత్కాలికంగానైనా బాధ్యతలు చేపట్టాలని నేతల మొర
  • సవాల్ తో కూడినదని అంటున్న సోనియా

రాహుల్ గాంధీ రాజీనామా తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు ఎవరు చేపట్టాలన్న దానిపై ఆ పార్టీలో అంతర్మథనం కొనసాగుతోంది. బాధ్యతలు ఎవరికి అప్పగించాలన్నదానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో పార్టీ పగ్గాలను తిరిగి సోనియా గాంధీనే చేపట్టాలని చాలామంది కోరుతున్నారు. పార్టీలో తీవ్ర సంక్షోభం నెలకొని ఉన్న ప్రస్తుత తరుణంలో అధ్యక్ష బాధ్యతలను తాత్కాలికంగా సోనియా గాంధీ స్వీకరించడమే కరెక్ట్ అన్న అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.

ఈ విషయాన్ని చాలామంది నేతలు ఇప్పటికే సోనియా దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఆమె మాత్రం అందుకు సుముఖంగా లేరని సమాచారం. తాత్కాలికంగానైనా ఆ పదవిని తాను చేపట్టలేనని, ఇది సవాల్‌తో కూడుకున్న వ్యవహారమని సోనియా తన సన్నిహితుల వద్ద అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.

వరుస సంక్షోభాలతో సతమతమవుతున్న కాంగ్రెస్‌ను తిరిగి గాడిలో పెట్టగలిగే నేత ఒక్క సోనియానేనని సీనియర్ నేతలు భావిస్తున్నారు. అయితే, అనారోగ్యం కారణంగా సోనియా మునుపటిలా చురుగ్గా ఉండడం లేదు. దీనికితోడు ఈ నెలలో చికిత్స కోసం ఆమె మరోమారు అమెరికా వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నేతల ప్రతిపాదనకు ఆమె ససేమిరా అన్నట్టు తెలుస్తోంది.  

More Telugu News