ముఖ్యమంత్రి జగన్ ను కలసిన వల్లభనేని వంశీ

11-07-2019 Thu 18:26
  • గోదావరి జలాల్ని తరలించేందుకు సహకరించండి
  • సొంత ఖర్చుతో నీళ్లు అందిస్తున్నానని వెల్లడి
  • ప్రభుత్వం ఉచితంగా విద్యుత్‌ను అందించింది
ఇప్పటికే ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాసిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, నేడు నేరుగా ఆయనతో భేటీ అయ్యారు. వంశీ కొన్ని విజ్ఞప్తులను జగన్ ముందుంచడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. పోలవరం కుడి కాలువ నుంచి నీటి మళ్లింపునకు విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ వంశీ ఇప్పటికే జగన్‌కు లేఖ రాశారు.

నేడు ఆయన భేటీ అయి గన్నవరం నియోజకవర్గంలోని మెట్ట గ్రామాలకు పోలవరం కుడికాల్వ నుంచి గోదావరి జలాల్ని తరలించేందుకు సహకరించాలని కోరారు. తన సొంత ఖర్చుతో 500 మోటార్లు ఏర్పాటు చేసి గత నాలుగేళ్లుగా నీళ్లు అందిస్తున్నానని, దీనికోసం ప్రభుత్వం ఉచితంగా విద్యుత్‌ను అందిస్తూ వచ్చిందని వెల్లడించారు. ఏపీఎస్పీడీసీఎల్ అధికారులకు ఆదేశాలిచ్చి గతంలో మాదిరిగానే విద్యుత్ సరఫరా ఇచ్చేలా చూడాలని వంశీ విజ్ఞప్తి చేశారు. దీనిపై జగన్ సానుకూలంగా స్పందించారు.