Telugudesam: టీడీపీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్సీ సతీశ్... లోకేశ్ పై సంచలన ఆరోపణలు

  • ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా
  • లోకేశ్ గ్రూపులను ప్రోత్సహిస్తున్నారు
  • పార్టీ ఇప్పుడు చంద్రబాబు చేతుల్లో లేదు

ఏపీలో టీడీపీకి మరో గట్టి దెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ అన్నం సతీశ్ టీడీపీకి గుడ్ బై చెప్పారు. నారా లోకేశ్ కారణంగానే తాను పార్టీని వీడాల్సి వస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసినట్టు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు చేతుల్లో లేదని, లోకేశ్ పార్టీని తన చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సతీశ్ ఆరోపించారు.

పార్టీ మీద కానీ, పార్టీ నిర్మాణంపై కానీ లోకేశ్ కు అవగాహన లేదని, లోకేశ్ పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. లోకేశ్ పెంచిపోషించిన గ్రూపులే ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణమయ్యాయని వ్యాఖ్యానించారు. తాను, తన కుమారుడే పార్టీని నడుపుతున్నామన్న భావనలో చంద్రబాబు ఉన్నారని సతీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే, ప్రత్యర్థి పార్టీకి 151 కాదు, 175 అసెంబ్లీ సీట్లు వచ్చినా ఆశ్చర్యపోనవసరంలేదని అన్నారు. ఒకప్పుడు పార్టీలో ఎంతో స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఉండేవని, ఇవాళ పార్టీలో ఆ పరిస్థితి లేదని అన్నారు.

లోకేశ్ ను నేరుగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడం, ఎమ్మెల్సీని చేయడం, చివరికి మంత్రిని చేయడం, వాటన్నింటినీ మించి ప్రతి నియోజకవర్గంలో లోకేశ్ తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పరచుకున్నారని, ఇలాంటి కారణాలే పార్టీపై వ్యతిరేకతకు దారితీస్తున్నాయని సతీశ్ తెలిపారు. తన తండ్రి తర్వాత పార్టీని ఎవరైనా లాక్కుంటారేమోనని లోకేశ్ అభద్రత భావానికి లోనై అందరినీ అనుమానిస్తున్నారని ఆరోపించారు.

More Telugu News