Sridhar Babu: రాష్ట్రంలో పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు: టీపీసీసీ ఉపాధ్యక్షుడు శ్రీధర్‌బాబు

  • టీఆర్ఎస్, బీజేపీల విధానం ఒక్కటే
  • హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు
  • బడ్జెట్‌లో రైతుల ప్రస్తావనే లేదు

రాష్ట్రంలో పోలీసులు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు శ్రీధర్ బాబు విమర్శించారు. నేడు పెద్దపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలీసులు రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే అవకాశాలున్నాయన్నారు. సమన్వయంతో పని చేయకుంటే పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందన్నారు. కేంద్రం చర్యలపై టీఆర్ఎస్ పెదవి విప్పట్లేదని, ఆ రెండు పార్టీల విధానం ఒక్కటేనని విమర్శించారు.

ఈ సారి బడ్జెట్‌లో సామాన్య మధ్యతరగతి ప్రజలతో పాటు రైతుల ప్రస్తావనే లేదన్నారు. ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చొద్దంటూ  హైకోర్టు ఇచ్చిన తీర్పు టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చాక దేశంలో 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిందని, కానీ ఆ ఊసే లేకపోగా సామాన్యులకు నష్టం కలిగించే చర్యలకు ఉపక్రమిస్తోందన్నారు. మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి వచ్చిన మోదీతో తామే సొంతంగా పూర్తి చేస్తామని, నిధులు అక్కర్లేదని టీఆర్ఎస్ చెప్పడాన్ని శ్రీధర్ బాబు తప్పుబట్టారు.

More Telugu News