Kishan Reddy: నేనెప్పటికీ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలకు సోదరుడ్నే: కిషన్ రెడ్డి

  • మంద కృష్ణ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు
  • ఎమ్మార్పీఎస్ ను బలహీనపర్చేందుకు ఎన్నో కుట్రలు జరిగాయి
  • ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని కాలరాసేందుకు ప్రయత్నించారు

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ప్రకాశం జిల్లా ఈదుమూడిలో జరిగిన ఎమ్మార్పీఎస్ 25వ వార్షికోత్సవ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాతికేళ్ల క్రితం ఈదుమూడిలోనే ఎమ్మార్పీఎస్ ఉద్యమం మొదలైందని, తాను కేంద్రమంత్రినైనా ఎప్పటికీ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలకు సోదరుడ్నేనని ఉద్వేగంతో ప్రసంగించారు. ఎన్ని కష్టాలు వచ్చినా, గత ప్రభుత్వాలు ఎంత వేధించినా మంద కృష్ణ మాత్రం ఉద్యమబాట వీడలేదని కొనియాడారు.

ఎస్సీ వర్గీకరణ కోసం మంద కృష్ణ సాగిస్తున్న అలుపెరుగని పోరాటానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని, ఆయనకు అండగా నిలుస్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎమ్మార్పీఎస్ ను బలహీనపర్చేందుకు, ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని కాలరాసేందుకు పాలకులు ఎన్నో కుతంత్రాలకు పాల్పడినా మంద కృష్ణ మాత్రం పోరాటపంథాను వీడలేదని అన్నారు. కాగా, ఈదుమూడిలో నిర్వహించిన మాదిగల ఆత్మగౌరవ సభలో కిషన్ రెడ్డిని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.

More Telugu News