Andhra Pradesh: వెకిలి వేషాల గుంటూరు డీఎస్పీపై సస్పెన్షన్ వేటు!

  • ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళ
  • తనకు సహకరిస్తే సమస్య పరిష్కరిస్తానంటూ డీఎస్పీ వెకిలి చేష్టలు
  • ఎస్పీకి ఫిర్యాదు చేసిన మహిళ

ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన గుంటూరు డీఎస్పీపై ఉన్నతాధికారులు వేటేశారు.  డీఎస్పీ రమేశ్ కుమార్ గుంటూరు అర్బన్ మహిళా పోలీస్ స్టేషన్‌ అధికారిగా పనిచేస్తున్నారు. చుట్టుగుంటకు చెందిన ఓ మహిళ ఇటీవల పోలీస్ స్టేషన్‌కు వచ్చి తన సమస్యలను ఏకరవు పెట్టింది. ఆమె కష్టాలను ఆసరాగా తీసుకున్న రమేశ్ కుమార్ అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.

అతడి ప్రవర్తనతో ఇబ్బంది పడిన ఆమె అక్కడే ఆయనను నిలదీసింది. అయినా పద్ధతి మార్చుకోని డీఎస్పీ తనకు సహకరిస్తే సమస్యను పరిష్కరిస్తానని చెప్పుకొచ్చాడు. దీంతో అతడి బారినుంచి తప్పించుకున్న బాధితురాలు ఐదు రోజుల క్రితం గుంటూరు అర్బన్ ఎస్పీని కలిసి రమేశ్ కుమార్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన విచారణకు ఆదేశించారు.

విచారణలో రమేశ్ కుమార్ చేసిన వెకిలి చేష్టలు నిజమేనని తేలాయి. దీంతో విచారణ నివేదికను డీజీపీకి పంపగా, అతడిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చే మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా డీజీపీ హెచ్చరించారు.

More Telugu News